రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉండవల్లిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఉచితంగా శాశ్వత గృహ పట్టాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా, 15 సంవత్సరాలుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి స్వయంగా వారి ఇంటికి వెళ్లి కొత్త బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు 'పట్టా'భిషేకం చేస్తున్నామని, ముఖ్యమైన హామీని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్ భూముల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల కష్టాలను చూశానని, వారికి శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించానని తెలిపారు.ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు మూడు విడతలుగా శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని, మొదటి విడతలో 150 గజాల్లోపు ఉంటున్న 3 వేల మందికి పట్టాలు ఇస్తున్నామని, రెండో విడతలో ఎండోమెంట్స్, రైల్వే భూముల్లో నివసించేవారికి, మూడో విడతలో మిగిలిన వారందరికీ పట్టాలు అందజేస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవడానికి గత ఐదేళ్లుగా తన సొంత నిధులతో 26 సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు లోకేశ్ తెలిపారు. ఉచిత తాగునీటి ట్యాంకర్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, కరోనా సమయంలో ఆక్సిజన్, టెలీ మెడిసిన్ సేవలు, ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలు, యువత కోసం క్రీడా పోటీలు వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలు తనపై నమ్మకంతో 91 వేల భారీ మెజారిటీతో గెలిపించారని, ఇది తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.మంగళగిరిలో 50 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం ద్వారా పార్కులు, రైతు బజార్లు అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పైప్ లైన్ ద్వారా గ్యాస్ వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయని, శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, చేనేతలకు కామన్ ఫెసిలిటీ సెంటర్, స్వర్ణకారులకు జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
![]() |
![]() |