ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఈ సీజన్‌లో నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయింది. సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది.222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఓ దశలో 12 ఓవర్లకు స్కోరు 99/4 తో ఉంది. ఈ దశలో ముంబై భారీ తేడాతో ఓడిపోతుందని అంతా భావించారు. అయితే.. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మతో లు అద్భుత భాగస్వామ్యంతో జట్టును పోటీలోకి తెచ్చారు. ఈ జోడి కేవలం 34 బంతుల్లోనే 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పాండ్యా కేవలం 15 బంతుల్లోనే మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 42 పరుగులు చేయడంతో ఆర్‌సిబి బౌలర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. తిలక్ వర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. చివరికి 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.వీరిద్దరు ఔట్ అయిన కానీ ముంబై విజయసమీకరణం ఆఖరి ఓవర్‌కు 6 బంతుల్లో 19 పరుగులుగా ఉంది. క్రీజులో నమన్ దీర్, మిచెల్ సాంట్నర్ లు ఉన్నారు. అయితే.. ఆర్‌సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా కట్టుదిట్టమైన బంతులతో ముంబైకి విజయాన్ని దూరం చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
తమ జట్టు ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. భారీ లక్ష్య చేధనలో పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయడం కీలకం అని, కానీ తమ బ్యాటర్లు తడబడ్డారని చెప్పాడు. నిజం చెప్పాలంటే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారిందన్నాడు.ఈ పిచ్ పై పరుగులను అడ్డుకోవడం బౌలర్లకు కష్టంగా మారిందన్నాడు. అయినప్పటికి బౌలర్లు ఆర్‌సీబీని కొంచెం తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. అలా అని బౌలర్లను నిందించడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇది బౌలర్లకు చాలా కఠినమైన పిచ్ అని చెప్పాడు. ఆర్‌సీబీ దూకుడుకు అడ్డుకట్టవేసే ఆప్షన్లు లేకుండా పోయాయని చెప్పాడు.
గత మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగి అదరగొట్టిన నమన్ దీర్‌ను ఆర్‌సీబీ మ్యాచ్‌లో డౌన్‌ది ఆర్డర్ పంపించడానికి గల కారణాన్ని హార్దిక్ వెల్లడించాడు. గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోవడంతో నమన్ ను మూడో స్థానంలో పంపించాము. ఈ మ్యాచ్‌కు రోహిత్ రావడంతో అతడిని డౌన్‌ది ఆర్డర్ పంపించాము. అయితే.. నమన్ ఏస్థానంలోనైనా ఆడగల సమర్థుడు అని హార్దిక్ చెప్పాడు.
ఇక తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. అసాధారణ ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో పవర్ ప్లే చాలా కీలకని పాండ్యా చెప్పాడు. పవర్ ప్లేలో ధాటిగా ఆడలేకపోయాం. కొన్ని ఓవర్లలో బంతిని మిడిల్ చేయలేకపోయాం. అదే మా పతనాన్ని శాసించిందన్నాడు. ఇక బుమ్రా గురించి మాట్లాడుతూ.. అతడు ఉన్న జట్టు ప్రత్యేకంగా నిలుస్తుంది. అతడు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతడు జట్టులో ఉండడం సంతోషించదగ్గ విషయం. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. తరువాతి మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు కృషి చేస్తాం అని హార్దిక్ అన్నాడు.
![]() |
![]() |