ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) బోణీ కొట్టింది. గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడిన రాజస్థాన్ ఈసారి కసిగా ఆడింది. నితీశ్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్‌కు వనిందు హసరంగ బౌలింగ్ తోడవడంతో చెన్నై చతికిలపడింది. లక్ష్య ఛేదనలో తడబడి వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37, సంజు శాంసన్ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీశ పథిరన తలా రెండు వికెట్లు తీసుకున్నారు.అనంతరం 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై పరుగుల వేటలో తడబడింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ రచిన్ రవీంద్ర వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి పాలైంది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. జోఫ్రా అర్చర్ ఈ సీజన్‌లోనే తొలి మెయిడెన్ ఓవర్ నమోదు చేశాడు. ఇక, హసరంగ బంతితో చెలరేగాడు. 4 ఓవర్లు వేసి 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బౌలర్ల దెబ్బకు విలవిల్లాడిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 39 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్‌లో ధోనీ ఫోర్, సిక్సర్, జడేజా సిక్స్ కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే, ఆఖరి ఓవర్‌లో సందీప్‌శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. తొలి బంతికి వైడ్ వేసినా ఆ వెంటనే ధోనీని ఔట్ చేయడంతో చెన్నై కథ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన జెమీ ఓవర్టన్ దూకుడుగా ఆడి నాలుగు బంతుల్లో సిక్సర్‌తో 11 పరుగులు చేసినప్పటికీ విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. ఇక, చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 32, రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశారు. 81 పరుగులతో చెలరేగిన నితీశ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
![]() |
![]() |