చిన్న జిరాక్స్ షాపు నిర్వాహకుడికి ఏకంగా రూ.39.19 లక్షలు చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. నోటీసు అందుకున్న వ్యక్తి ఆందోళనతో అధికారులను సంప్రదించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విషయంలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం భరణికం గ్రామానికి చెందిన ఎ. హరికృష్ణ, అదే మండలం వెంకటాపురం గ్రామంలో జిరాక్స్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఇటీవల ఒంగోలు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం నుంచి నోటీసు అందింది. అందులో మీరు ఒంగోలులో నడిపిన హనుమాన్ ట్రేడర్స్ కు సంబంధించి రూ.36.19 లక్షల జీఎస్టీ బకాయిలు ఉన్నాయని, వెంటనే చెల్లించకపోతే మీ పేరు మీద ఉన్న 15 సెంట్ల స్థలాన్ని బహిరంగ వేలం వేస్తామని పేర్కొన్నారు.ఈ నోటీసుతో షాక్ తిన్న హరికృష్ణ, శ్రీకాకుళంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయ అధికారులను కలిసి తాను ఒంగోలులో ఎటువంటి వ్యాపారం చేయలేదని వివరించాడు. తాను ఒంగోలులో 2008 నుంచి 2015 వరకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో ఉద్యోగిగా పని చేసినట్లు తెలిపాడు.దీంతో అధికారులు విచారణ చేపట్టగా, హరికృష్ణ పేరు మీద ఒంగోలులో 2018లో తుక్కు వ్యాపారం చేసేందుకు హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి, దాన్ని 2019లో మూసివేసినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టేందుకు హరికృష్ణ పేరు మీద వ్యాపారం నెలకొల్పి మోసం చేసినట్లు అధికారులు తెలుసుకున్నారు.ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లా సహాయ కమిషనర్ రాణీమోహన్ మాట్లాడుతూ, హరికృష్ణ చెప్పిన వివరాలను ఒంగోలు పన్నుల అధికారులకు తెలియజేశామని అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని ఆమె వెల్లడించారు.
![]() |
![]() |