వైసీపీ అధినేత జగన్ ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై విరుచుకుపడ్డారు. బట్టలూడదీసి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్ ఊడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.లింగమయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని... రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు కలిగిందని... 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందని చెప్పారు. టీడీపీకి బలం లేకపోయినా ఎన్నికల్లో నిలుస్తోందని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా ఉన్నాననే అహంకారంతో చంద్రబాబు ఉన్నారని... నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని జగన్ మండిపడ్డారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేశ్ పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలేనని చెప్పారు.
![]() |
![]() |