ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జట్టులో చిన్న ఛేంజ్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఏం చేస్తారో

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 10:52 PM

ఐపీఎల్ 2025 సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో 286 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరిన.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత గాడి తప్పింది. ఈ మ్యాచ్ తర్వాత నాలుగు మ్యాచ్‌లు ఆడినా.. ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. 300 కొట్టడమే లక్ష్యమంటూ.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు.. కానీ ఆ జట్టు కనీసం 200 కూడా చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే.. ఆ జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ జట్టుతో పోటీకి సిద్ధమైంది.


హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి బంతి నుంచి ఎటాక్ చేయడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులేకుండానే బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. కామిందు మెండిస్‌ ప్లేసులో ఇషాన్ మలింగను తుది జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.


హెడ్ టు హెడ్ రికార్డ్స్..


సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్‌లో 23 మ్యాచ్‌లు జరిగాయి. అందులో సన్‌రైజర్స్.. అత్యధికంగా 16 మ్యాచ్‌లలో గెలిచింది. పంజాబ్ కింగ్స్ కేవలం 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయం సాధించింది. అయితే గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈసారి పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగింది. వరుస విజయాలు సాధిస్తూ.. పాయింట్ల పట్టికలో ఐదో ప్లేసులో నిలిచింది. మరి ఇవాళ్టి మ్యాచ్‌లో పంజాబ్ గెలిచి.. తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటుందా? లేదా సన్‌ రైజర్స్ మళ్లీ విజయాల బాట పడుతుందా? అన్నది తేలాల్సి ఉంది.


తుది జట్లు..


సన్‌రైజర్స్ హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్‌), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఇషాన్ మలింగ


పంజాబ్ కింగ్స్‌:


ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌), శ్రేయస్ అయ్యర్‌ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్‌, నేహాల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, శశాంక్ సింగ్‌, మార్కో జాన్సెన్‌, అర్షదీప్ సింగ్‌, లుకీ ఫెర్గూసన్‌, యుజ్వేంజ్ర చాహల్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com