ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి కోసం లోన్,,,, వడ్డీ తగ్గించిన బ్యాంకులివే

business |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 11:09 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రెపో రేటును మరో పావు శాతం కోత పెట్టింది. దీంతో వడ్డీ రేట్లు భారీగా దిగివచ్చాయి. ఈ క్రమంలో దిగ్గజ ప్రభుత్వ బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ ఏడాది ఇది రెండోసారి వడ్డీ రేట్లు తగ్గించడం. ప్రముఖ బ్యాంకులు ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ వంటి దిగ్గజాలు ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్లను సవరించాయి. ఆర్‌బీఐ ఇచ్చిన వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను తమ కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకునే వారితో పాటు, తీసుకున్న వారికి సైతం ఈఎంఐల భారం తగ్గనుంది. మరి ఆ బ్యాంకుల జాబితా తెలుసుకుందాం.


దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. రుణ వడ్డీ రేట్లను 0.25 శాతం మేర కోత పెట్టింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను ఏప్రిల్ 15 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. హోమ్ లోన్లకు లింక్ అయిన ఈబీఎల్ఆర్ రేటును 8.90 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. దీంతో గృహ రుణాల ఈఎంఐల భారం భారీగా తగ్గనుంది.


ఇక దేశంలోని రెండో అతిపెద్ బ్యాంకుగా పేరుగాంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం రెపో లింక్డ్ లెండింగ్ రేటును 8.90 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. అలాగే ఆర్ఎల్ఎల్ఆర్‌పై ఫిక్స్‌డ్ మార్జిన్ ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకులో హోమ్ లోన్ కనీస వడ్డీ రేటు 9.10 శాతం నుంచి 8.85 శాతానికి దిగివచ్చింది. దాదాపు 25 పాయింట్ల మేర వడ్డీ తగ్గడంతో ఈఎంఐ సైతం భారీగా తగ్గుతుంది. హోమ్ లోన్ వడ్డీపై భారీగా ఆదా అవుతుంది.


ఇండియన్ బ్యాంకు సైతం రుణ వడ్డీ రేట్లను సవరించింది. రెపో బెంచ్ మార్క్ రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అలాగే రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 9.05 శాతం నుంచి 8.70 శాతానికి పరిమితం చేసింది. అంటే దాదాపు 35 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. కొత్త రేట్లను ఏప్రిల్ 11 నుంచే అమలు చేస్తోంది. దీంతో హోమ్ లోన్ వడ్డీ భారం భారీగా తగ్గనుంది. నెలవారీ ఈఎంఐలు తగ్గనున్నాయి.


పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తమ కస్టమర్లకు ఇటీవలే శుభవార్త అందించింది. హోమ్ లోన్లకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఏప్రిల్ 9, 2025 నుంచే అమలు చేస్తోంది. రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 9.10 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గించింది. అంటే దాదాపు 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గింది. దీంతో హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గనుంది.


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం తమ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది. హోమ్ లోన్లకు లింక్ అయి ఉండే రెపో లింక్డ్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆర్ఎల్ఎల్ఆర్ 8.80 శాతంగా ఉంది. అంటే గృహ రుణాలు తీసుకునే వారికి, తీసుకున్న వారికి వడ్డీ భారం తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com