ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పానాసోనిక్ హోల్డింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న వారిలో సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ లాభదాయకతను పెంచుకోవడం, కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగులలో సుమారు 2,30,000 మంది దాదాపు 4 శాతానికి సమానం.ఈ ఉద్యోగాల కోతను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని పానాసోనిక్ లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్‌లో 5,000 మంది, విదేశాల్లో మరో 5,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నారు. ఈ పునర్‌వ్యవస్థీకరణ కోసం కంపెనీ సుమారు 896 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుండగా, దీని ద్వారా 2029 మార్చి నాటికి 2.1 బిలియన్ డాలర్ల అదనపు లాభం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సేల్స్, పరోక్ష కార్యకలాపాల విభాగాల్లో సామర్థ్యాన్ని సమీక్షించిన తర్వాత ఈ కోతలు ఉంటాయని కంపెనీ తెలిపింది. నష్టాల్లో నడుస్తున్న వ్యాపారాలను మూసివేయడం, సైట్ల ఏకీకరణ, జపాన్‌లోని ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ వంటి మార్గాల ద్వారా ఈ తొలగింపులు అమలు చేయనున్నారు.తీవ్రమైన పోటీ నెలకొన్న మార్కెట్‌లో లాభదాయకత పెంచుకోవడానికి ఈ నిర్ణయం తప్పలేదని పానాసోనిక్ సీఈఓ యూకీ కుసుమి గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలో తన వేతనంలో 40% తిరిగి ఇచ్చేస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం. పానాసోనిక్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌ల వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మందగించడం, ప్రత్యర్థులైన హేయర్, మిడియా వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ, లాభాల మార్జిన్లు తగ్గడం వంటి అనేక ఒత్తిళ్లు కూడా ఈ నిర్ణయానికి కారణాలుగా ఉన్నాయి. టెస్లా, మజ్దా, సుబారు వంటి సంస్థలకు బ్యాటరీలను సరఫరా చేసే కీలక విభాగమైన ఎలక్ట్రిక్ వాహన డిమాండ్ మందగించడం కూడా పానాసోనిక్ బ్యాటరీ వ్యాపారంపై ప్రభావం చూపింది. అదనంగా, అమెరికా వాణిజ్య సుంకాల వంటి ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పానాసోనిక్ కృత్రిమ మేధ ఇంధన నిల్వ వంటి అధిక వృద్ధి రంగాలపై దృష్టి సారిస్తోంది. ఈ లేఆఫ్‌లు ప్రభావిత ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపనున్నప్పటికీ, కంపెనీ దీర్ఘకాలిక పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ చర్యలు అవసరమని భావిస్తోంది.
![]() |
![]() |