ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీమ నీటి హక్కుల విషయంలో చంద్రబాబు ప్రజలకి అన్యాయం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 12:08 PM

రాయల‌సీమ నీటి హక్కులను కాల‌రాస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో లాలూచీప‌డ్డార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా విమర్శించారు. శాస‌న మండ‌లిలో గురువారం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కూట‌మి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కు నోరు విప్ప‌లేద‌న్నారు.  రాయల‌సీమ వాసిగా ఉన్న చంద్రబాబు సీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. శ్రీ‌శైలం ప్రాజెక్ట్ నుంచి 800 అడుగుల లోపు తెలంగాణ ప్రాంతం నీటిని తరలించుకుంటోందని, అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ ద్వారా 841 అడుగుల నీటిమట్టం వద్ద మాత్రమే సీమ ప్రాంతానికి నీరు అందుతుందని ఆయన వివరించారు. 800 అడుగుల లోపు నీటిని సీమ వాటాగా తీసుకురావడానికి గత ప్రభుత్వ హయాంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు రాయల‌సీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభించారని, దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే ప్రాజెక్టు పనులు నిలిపివేయడం సరికాదని, రాయల‌సీమ రైతుల హక్కులైన నీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తారా లేదా రాయల‌సీమ ప్రజలకు ద్రోహిగా మిగిలిపోతారా అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చాలని ఇషాక్‌బాషా ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa