ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ రక్షణ మంత్రి విచిత్ర వాదన, నెటిజన్ల ట్రోలింగ్

international |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 08:25 PM

ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారం చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇక భారత్ విషయంలో అయితే పాక్ నేతలు, పాక్ సైన్యం.. ఇలాంటివి మరిన్ని ఎక్కువగానే చేస్తూ ఉంటారు. అయితే తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో.. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో భారత్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌పై తమ సైబర్ టీమ్ దాడి చేసిందని.. అందుకే ఆ రోజు స్టేడియంలో ఫ్లడ్ లైట్లను హ్యాక్ చేసి ఆపేసినట్లు పేర్కొన్నారు. ఈ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ఆన్‌లైన్‌లో ట్రోల్స్‌కు గురవుతున్నారు.


పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్.. తమ దేశానికి చెందిన సైబర్ నిపుణులు.. భారత్‌లోని ఒక క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా హ్యాక్ చేసి స్టేడియంలోని లైట్లను ఆపివేశారని పేర్కొన్నారు. మే 8వ తేదీన ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన దాడుల తర్వాతి రోజు ఈ ఘటన చోటు చేసుకుంది.


అయితే ఈ సైబర్ హ్యాకింగ్ అంతా పూర్తిగా పాకిస్తాన్ స్వదేశీ టెక్నాలజీ అని భారత్ అర్థం చేసుకోవడం లేదని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సైబర్ వారియర్స్ భారత్‌పై సైబర్ దాడులు చేసి.. స్టేడియంలో లైట్లను ఆపడంతో ఐపీఎల్ మ్యాచ్ నిలిచిపోయిందని వెల్లడించారు. అంతేకాకుండా భారత్‌లోని డ్యామ్‌ల నుంచి నీటిని కూడా పాక్ సైబర్ నిపుణులు విడుదల చేశారని.. విద్యుత్ గ్రిడ్‌ను కూడా నిలిపివేశారని ఖవాజా ఆసిఫ్ చెప్పడం గమనార్హం. ఈ దాడులు, సైబర్ దాడులు అన్నీ పాక్ సైబర్ నిపుణులు చేశారని చెప్పారు. ఖవాజా ఆసిఫ్ మాట్లాడిన 29 సెకన్ల క్లిప్ ప్రస్తుతం ఎక్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఖవాజా ఆసిఫ్ చేసిన విచిత్రమైన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు.


సైబర్ దాడుల్లో వేర్వేరు కాన్సెప్ట్‌లు, సిలబస్ పాకిస్తాన్‌లో ఉందని నాకు తెలియదు అంటూ ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టారు. ఇక మరో యూజర్ పాకిస్తాన్‌ను ట్రోల్ చేశాడు. పాకిస్తాన్ తెలుసుకోవల్సింది ఏంటంటే ఐపీఎల్ ఫ్లడ్‌లైట్లు వైఫై ఆధారంగా పనిచేయవని.. అవి సురక్షితమైన ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌లో పనిచేస్తాయని పేర్కొన్నారు. ఇంట్లో వైఫై రూటర్ లాగా దాన్ని హ్యాక్ చేయలేరని.. స్టేడియం లైట్లను ఆపివేయడం సైబర్ దాడి అని చెప్పుకోవడం కామెడీగా ఉందని తెలిపారు. పాకిస్తాన్ మంత్రి సైన్స్ క్లాస్‌ చదువుకోలేదని.. వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. ఇంకోసారి స్కోర్‌బోర్డ్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించండి కనీసం దానికి బటన్లు ఉంటాయని వ్యాఖ్యానించారు.


"లైట్లను ఆపడం సైబర్ దాడి అయితే.. నా 3 ఏళ్ల మేనల్లుడు ప్రపంచానికి ముప్పుగా మారతాడు. ఎందుకంటే అతను ఒకసారి జూమ్ మీటింగ్‌లో వైఫై ప్లగ్‌ను తీసివేశాడు" అని మరో నెటిజన్ పేర్కొన్నారు. యుద్ధం సమయంలో దాడుల దగ్గరి నుంచి స్టేడియం లైట్ల వరకు పాకిస్తాన్ సైబర్ స్ట్రైక్ వ్యూహాత్మక విజయంగా కాకుండా కామెడీ స్క్రిప్ట్‌గా ఎక్కువ అనిపిస్తుందని మరొకరు రాసుకొచ్చారు.


అయితే ఖవాజా ఆసిఫ్ ఆన్‌లైన్‌లో ట్రోల్స్‌కు గురికావటం ఇదేం తొలిసారి కాదు. ఆపరేషన్ సిందూర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత.. 5 భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ కూల్చివేసిందనే వాదనకు ప్రూఫ్స్ ఖవాజా ఆసిఫ్‌ను ఒక యాంకర్ అడిగారు. దానికి సంబంధించిన వివరాలు మొత్తం సోషల్ మీడియాలో ఉంది అని ఖవాజా ఆసిఫ్ సమాధానం ఇవ్వడం పాకిస్తాన్‌ను తీవ్ర నవ్వుల పాలు చేసింది. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని చేసిన వాదనలను సమర్థించడంలో ఆయన విఫలం కావడంతో ఆయన ట్రోలింగ్‌కు గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa