గత ఐదు రోజులుగా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ.. యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన థాయ్‌లాండ్ , కంబోడియా దేశాలు ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు తొలగిపోయాయి. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మలేసియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. థాయ్‌లాండ్, కంబోడియా దేశాల సరిహద్దుల మధ్య గత ఐదు రోజులుగా తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి.
కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న వివాదం.. గత కొద్ది వారాలుగా తీవ్రమయ్యి.. ఇరు దేశాల మధ్య పరస్పర కాల్పులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో రెండు దేశాల నుంచి సుమారు 35 మంది చనిపోయారు. ఘర్షణ వాతావరణం వల్ల 2,60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ వల్ల థాయ్ ,కంబోడియా దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. థాయ్, కంబోడియా దేశాల సరిహద్దుల మధ్య కాల్పులు ప్రారంభం అయిన వెంటనే స్పందించిన ట్రంప్.. ఇరు దేశాలు ఘర్షణను ఆపకపోతే.. థాయ్, కంబోడియాతో.. అమెరికా వాణిజ్య చర్చలు నిలిపివేస్తుందని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు చర్చలు జరిగాయి. థాయ్, కంబోడియా చర్చలకు మలేసియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం నాయకత్వం వహించారు.
ఈ చర్చల్లో థాయ్ తాత్కాలిక ప్రధాని పుంథం వేచాయాచాయ్, కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్ పాల్గొన్నారు. అలానే చైనా, అమెరికా రాయబారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సుమారు 2 గంటలు పాటు ఈ చర్చలు సాగాయి. చివరకు ఇరు దేశాల మధ్య ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈవిషయం గురించి మలేసియా ప్రధాని సోమవారం నాడు సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా థాయ్, కంబోడియాలకు చెందిన నాయకులు... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలకు నాయకత్వం వహించిన మలేసియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. థాయ్, కంబోడియా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి, శాంతి పునరుద్ధరణకు ఇది కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఇక రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.. మలేషియా సమయం ప్రకారం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కాల్పుల విరమణకు సంబంధించి రెండు దేశాల సైనిక కమాండర్లు మంగళవారం 7 గంటలకు అనధికారిక సమావేశం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa