చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలా మంది అనేక వ్యాధులకు బాధితులుగా మారుతున్నారు. అలాంటి వాటిలో పెద్దపేగు క్యాన్సర్ ఒకటి. యువతలో ఇది వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సోసైటీ నివేదిక ప్రకారం పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రతి ఐదు రోగుల్లో ఒకరు 55 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్లే. ఈ క్యాన్సర్ పెద్ద పేగు లోపలి గోడ నుంచి ప్రారంభమై నెమ్మదిగా శరీరంలో వ్యాపిస్తుంది. చాలా మంది కడుపు సమస్యగా భావించి దీనిని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ లక్షణాలతో అప్రమత్తం అవ్వచ్చు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మలవిసర్జనలో మార్పు
పెద్దపేగు క్యాన్సర్ అత్యంత సాధారణం లక్షణం మలవిసర్జనలో మార్పు. మీకు మలవిసర్జన సాఫీగా జరిగితే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే, ఉన్నట్టుండి మలవిసర్జన అలవాట్లలో మార్పు కనిపిస్తే అప్రమత్తం అవ్వాలి. మలవిసర్జన అలవాట్లలో మార్పు అంటే విరేచనాలు, మలబద్ధకం లేదా మలం రంగులో మార్పు ఉండవచ్చు. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
మలంలో రక్తస్రావం
మలంలో రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఇది పెద్దపేగు క్యాన్సర్‌కు ముఖ్యమైన సంకేతం కావచ్చు. రక్తం యొక్క రంగు ముదురు ఎరుపు లేదా నలుపు రంగులో ఉండవచ్చు. పైల్స్ లేదా పగుళ్ల కారణంగా కూడా రక్తస్రావం సంభవించవచ్చు. ఈ లక్షణం పదే పదే కనిపిస్తే ఎలాంటి అలసత్వం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
కడుపు నొప్పి లేదా తిమ్మిరి
మీకు పదే పదే కడుపు నొప్పి వస్తుందా? చాలా మంది కడుపు నొప్పే కదా అని లైట్ తీసుకుంటారు. అయితే, పదే పదే కడుపు నొప్పి రావడం పెద్దపేగు క్యాన్సర్ సంకేతం కావచ్చు. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం లేదా తిమ్మిరి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. ఎటువంటి కారణం లేకుండా నొప్పి చాలా కాలం కొనసాగితే పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
బరువు తగ్గడం
మీరు ఉన్నట్టుండి బరువు తగ్గారా.. జిమ్‌కి వెళ్లకుండా, ఆహారంలో మార్పులు ఏం చేయకుండా బరువు తగ్గితే మాత్రం అలర్ట్ అవ్వండి. ఎటువంటి ప్రయత్నం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం పెద్దపేగు క్యాన్సర్‌కు హెచ్చరిక సంకేతం కావచ్చు. ఇది క్యాన్సర్ వల్ల శరీరంలో జీవక్రియ మార్పుల వల్ల వస్తుంది. ఉన్నట్టుండి బరువు తగ్గితే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
అలసట, బలహీనత
చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా! అదేనండీ తక్కువ దూరం నడిచినా, మెట్లు ఎక్కినా అలసట, బలహీనత అనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం వద్దు. పెద్దపేగు క్యాన్సర్ తరచుగా మలంలో రక్తస్రావం కలిగిస్తుంది. ఇది శరీరంలో ఐరన్ లోపానికి కారణమవుతుంది. దీని వల్ల అలసట, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పూర్తిగా మలవిసర్జన జరగనట్టు అనిపించడం
కొంతమంది రోగులు మలవిసర్జన తర్వాత కూడా కడుపు క్లియర్ కానట్లు భావిస్తారు. ఈ పరిస్థితిని టెనెస్మస్ అంటారు. ఇది పెద్దపేగు లేదా పురీషనాళంలో కణితి వల్ల సంభవించవచ్చు. మీకు పదే పదే ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెద్దపేగు క్యాన్సర్ కారకాలు
* కుటుంబ చరిత్ర: కుటుంబంలో ఎవరికైనా పెద్దపేగు క్యాన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉంటే, ప్రమాదం పెరుగుతుంది.
* చెడు జీవనశైలి: రెట్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారం, ఫైబర్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం, మద్యం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా వ్యాయామం చేయని వ్యక్తులకు ఈ ప్రమాదం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
* ఊబకాయం: ఊబకాయం, మధుమేహం పెద్దపేగు క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు.
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, క్రోన్'స్ వ్యాధి లేదా అల్సరేటివ్ కొలిటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa