ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం ధరలకు రెక్కలు.... అప్పటి కల్లా తులం రూ.1,25,000

business |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 10:37 PM

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ స్థోమతకు తగినట్లుగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఏడాది పొడవునా బంగారానికి గిరాకీ ఉంటుంది. ఇటీవలి కాలంలో పసిడిని ఒక పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని, అత్యవసర సమయంలో ఆదుకుంటుందని ఎక్కువ మంది దీనిని ఎంచుకుంటున్నారు. దీంతో భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని, పసిడి ధరలు మరింత పెరుగుతాయని ఓ నివేదిక తెలిపింది. 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం రేటు రూ. 99,500 నుంచి రూ.110,000 మధ్య కదలాడుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసర్చ్ గ్రూప్ తెలిపింది. అదే 2026 మొదటి అర్ధ భాగం ముగిసే నాటికి తులం బంగారం రేటు రూ.1,25,000 స్థాయికి చేరుతుందని అంచనా వేస్తింది.


'మన అంచనాల కంటే డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చాలా తక్కువ స్థాయిలో ట్రేడవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రూపాయి విలువ రూ.87-89 మధ్య ఉంటుంది. గ్లోబల్ గోల్డ్ ధరలు ఈ 2025లో ఇప్పటి వరకు 33 శాతం మేర పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణతపై ఆందోళనలు బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయి. 2025 చివరి నాటికి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3400- 3600 డాలర్ల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది 2026 ఫస్ట్ హాఫ్ నాటికి 3600 నుంచి 3800 ఔన్స్ ధరకు చేరుకోవచ్చు. ' అని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకానమిక్ రీసర్చ్ గ్రూప్ అంచనా వేసింది. ఒక వేళ ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు మరింత పెరగవచ్చని తెలిపింది.


భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ అనిశ్చితుల మధ్య బంగారం కొనుగోళ్లు తగ్గినప్పటికీ, బంగారం ర్యాలీ తదుపరి దశ అమెరికా పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నివేదిక తెలిపింది. వీటిలో 2025-26లో ఫెడ్ రేటు తగ్గింపుల అంచనా వేసిన 125 బేసిస్ పాయింట్లు, యూఎస్ డాలర్ నుంచి కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారుల్లో కొనసాగుతున్న వైవిధ్యీకరణ వంటివి ఉన్నాయని పేర్కొంది. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే రుపాయి విలువ తగ్గడం, బంగారంలో పెట్టుబడులకు డిమాండ్ పెరగడం అనేది పసిడి ధరలు మరింత పెరిగేందుకు కారణమవుతున్నట్లుగా తెలిపింది. జూలై 2025లో భారతీయ దిగుమతులు 18 బిలియన్ డాలర్ల నుంచి 4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. పండుగల సీజన్‌లో దేశీయ డిమాండ్‌ను ఇది సూచిస్తోందని తెలిపింది.


భారత్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ పథకాలకు సైతం మంచి ఆదరణ లభిస్తోందని, గతేడాదతో పోలిస్తే ఈ 2025లో పెట్టుబడులు రెండింతలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో లాభాలు అందుకునేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఇక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి జూలైలో రూ.12.6 బిలియన్ల మేర పెట్టుబడులు వచ్చాయి. అయితే అది జూన్ నెలలో రూ.20.8 బిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ. గతడేదితో పోలిస్తే రెండింతలు పెరిగి రూ.92.8 బిలియన్లకు చేరుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa