ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో సరైన బుద్ధి చెప్పామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన.. ఉగ్రవాదంపై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సైనిక చర్యకు సంబంధించిన రెండవ, మూడవ దశలను కూడా ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటూ.. దీనిపై నిర్ణయం పాకిస్థాన్ వైఖరిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
మొరాకోలోని భారతీయ సంఘంతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో.. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఆపరేషన్ సిందూర్‌ను తాత్కాలికంగానే నిలిపివేశామని, దీనికి రెండో, మూడో దశలు కూడా కొనసాగించాలా వద్దా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అది పాకిస్థాన్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే.. వారికి తగిన సమాధానం కచ్చితంగా లభిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ఏ క్షణాన అయినా తిరిగి ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.
గతేడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 7వ తేదీన పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఈ చర్యలో 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. అంతేకాకుండా ఇస్లామాబాద్ ఉద్రిక్తతలను పెంచిన తర్వాత పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై కూడా భారత్ దాడులు చేసింది.
ఈ దాడి గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “పహల్గాంలో దాడి జరిగిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న సీడీఎస్, ముగ్గురు సర్వీస్ చీఫ్‌లు, రక్షణ కార్యదర్శితో నేను సమావేశమయ్యాను. అప్పుడే ప్రభుత్వం ఒక ఆపరేషన్‌కు నిర్ణయం తీసుకుంటే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని అడిగాను. మీరు ఆశ్చర్యపోతారు. వారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత మేము ప్రధాని మోదీని సంప్రదించాం. ఆయన మాకు ముందుకు వెళ్లమని, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు. సరిహద్దుల్లో కాకుండా వారి భూభాగంలో 100 కిలో మీటర్ల లోపల ఉన్న ఉగ్ర స్థావరాలను మేము ధ్వంసం చేశాం. జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఒక అగ్ర ఉగ్రవాది, మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైందని చెప్పడం జరిగింది” అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
పీఓకేపై సంచలన వ్యాఖ్యలు
రక్షణ మంత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే దానికదే మనది అవుతుందన్నారు. పీఓకేలో నినాదాలు ప్రారంభమయ్యాయిని.. మీరు కూడా వాటిని వినే ఉంటారన్నారు. ఐదు సంవత్సరాల క్రితం కాశ్మీర్‌లో భారత సైన్యాన్ని ఉద్దేశించి నేను ప్రసంగిస్తున్నప్పుడు.. పీఓకేను ఆక్రమించుకోవడానికి మనం దాడి చేయాల్సిన అవసరం లేదు, అది ఎలాగైనా మనదే అని చెప్పానని గుర్తు చేశారు. పీఓకే త్వరలోనే ‘నేను కూడా భారత్‌లో భాగం అవుతాను’ అని చెప్తుందన్నారు. ఆ రోజు తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa