కర్ణాటకలోని దావణగెరెలో ఒక ఫ్లెక్సీ బ్యానర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం రాళ్ల దాడికి కారణమైంది. ఈ ఘటనలో ఒక బాలిక గాయపడగా, కొన్ని ఇళ్ల తలుపులు ధ్వంసమయ్యాయి. పోలీసులు సత్వరమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దావణగెరెలోని కార్ల్ మార్క్స్ నగర్లో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'ఐ లవ్ మహమ్మద్' అని రాసి ఉన్న ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ బ్యానర్‌ను వెంటనే తొలగించాలని ఒక వర్గం పట్టుబట్టడంతో వివాదం ముదిరింది. కొద్దిసేపటికే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఒక బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న ఆజాద్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ ఈ ఘటనపై స్పందిస్తూ, "బ్యానర్ ఏర్పాటు విషయమై రెండు వర్గాలు గుమికూడాయి. పోలీసులు ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంది. వివాదాస్పద బ్యానర్‌ను కూడా తొలగించాం" అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa