అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దిగుమతి చేసుకునే బ్రాండెడ్ మందులపై 100 శాతం సుంకం, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకం, వంటగది క్యాబినెట్లపై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ఆయన శుక్రవారం తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అమెరికాలో ఫార్మాస్యూటికల్ తయారీ ప్లాంట్‌ను నిర్మిస్తే ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని కూడా చెప్పారు. స్థానిక తయారీదారులను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. అందులో "అక్టోబర్ 1వ తేదీ నుంచి.. ఏదైనా బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై 100 శాతం సుంకం విధిస్తాం. ఒక కంపెనీ అమెరికాలో ఫార్మాస్యూటికల్ తయారీ ప్లాంట్‌ను నిర్మిస్తే ఈ సుంకం ఉండదు" అని ఆయన అన్నారు. అమెరికాలో తయారీ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించని కంపెనీల నుంచి దిగుమతి చేసుకునే అన్ని బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై ఈ 100 శాతం సుంకం వర్తిస్తుంది. ఈ నిర్ణయం అమెరికాలో ఔషధాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, స్థానిక కంపెనీలను కాపాడటానికి ఉద్దేశించినదని ట్రంప్ తెలిపారు.
అయితే ఈ సుంకాలపై 'ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ అమెరికా' (PhRMA) తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. అమెరికాలో వినియోగించే 85.6 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలలోని 53 శాతం పదార్థాలు ఇప్పటికే అమెరికాలోనే తయారు అవుతున్నాయని.. మిగతావి యూరప్, ఇతర మిత్ర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని PhRMA ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొంది. దిగుమతులపై సుంకాలు విధించడం వల్ల ఔషధాల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఔషధాలతో పాటు మరికొన్ని ఉత్పత్తులపై కూడా ట్రంప్ సుంకాలు ప్రకటించారు. భారీ ట్రక్కులపై 25 శాతం సుంకం విధించడం ద్వారా దేశీయ తయారీదారులైన పీటర్‌బిల్ట్, కెన్‌వర్త్, ఫ్రైట్‌లైనర్ వంటి కంపెనీలను రక్షించవచ్చని అన్నారు. కానీ ఈ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకించింది. మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాల నుంచి ట్రక్కులు ఎక్కువగా దిగుమతి అవుతాయని, ఈ దేశాలు అమెరికాకు మిత్రదేశాలని, ఇవి ఏ మాత్రం అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కాదని పేర్కొంది.
అంతేకాకుండా దేశీయ తయారీదారులకు నష్టం కలిగిస్తున్నందున కిచెన్ క్యాబినెట్‌లపై 50 శాతం సుంకం, బాత్‌రూమ్ వానిటీలు, ఫర్నిచర్‌పై 30 శాతం సుంకాన్ని వచ్చే వారం నుంచి ప్రారంభిస్తామని అన్నారు. ఇవన్నీ అక్టోబర్ 1న తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రంప్ చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు విధించి, గ్లోబల్ ట్రేడ్‌ను ప్రభావితం చేస్తున్నారు. ఈ కొత్త చర్యలు కూడా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఈ సుంకాలు అమెరికాలోని స్థానిక కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తాయని ట్రంప్ వాదిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు ధరలు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa