రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలపై నేడు శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల కాలంలోనే రాష్ట్రంలోని వివిధ రంగాల్లో మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఉపాధ్యాయులను, ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో 9,093 మందిని, పోలీస్ విభాగంలో 6,100 మందిని నియమించినట్లు తెలిపారు. వీటితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి, వర్క్ ఫ్రం హోం అవకాశాల ద్వారా మరో 5,500 మందికి ఉపాధి లభించిందన్నారు. ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల ద్వారా అత్యధికంగా 3,48,891 మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఎవరు, ఎక్కడ, ఏ రంగంలో ఉద్యోగం పొందారనే పూర్తి వివరాలతో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తొలి తరం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనే కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. హైవేల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక అవసరాలు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రైల్వే రంగంలో రాష్ట్రంలో 145 రకాల పనులు పురోగతిలో ఉన్నాయని, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ల ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం రైల్వే జోన్‌ను ప్రారంభించి, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించామని గుర్తుచేశారు.లాజిస్టిక్స్ రంగంలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. కార్గో రవాణాలో గుజరాత్ తర్వాత మన రాష్ట్రమే ఉందని, కొత్తగా రానున్న నాలుగు పోర్టుల నిర్మాణంతో ఈ సామర్థ్యం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పోర్టుల నిర్మాణానికి నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నామని, జల రవాణా కోసం ఇన్‌లాండ్ మార్గాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విమానయాన రంగం గురించి మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలోని ఇతర ఎయిర్‌పోర్టులలో టెర్మినళ్లు, రన్‌వేలను విస్తరిస్తామని ఆయన సభకు వివరించారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.దసరా ఉత్సవాల విషయంలో విజయవాడ నగరాన్ని దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన కోల్‌కతా, మైసూరు నగరాల సరసన నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర పర్యాటక రంగంలో విజయవాడ దసరా వేడుకలను ఒక ముఖ్యమైన ఆకర్షణగా తీర్చిదిద్దుతామని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa