ప్రపంచ రాజకీయాల్లో అత్యంత అరుదైన, సంచలనాత్మక సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరిగా వెలుగొందిన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ప్యారిస్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా లక్ష యూరోల (భారత కరెన్సీ ప్రకారం 1.03 కోట్లు) జరిమానా కూడా విధించింది. ఆధునిక ఫ్రాన్స్ చరిత్రలో ఓ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష పడడం ఇదే తొలి సారి కాగా ప్రజలంతా షాక్ అవుతున్నారు.
ఈ కేసు ప్రధానంగా 2007లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకుంది. నికోలస్ సర్కోజీ ఎన్నికల ప్రచారం చేసేందుకు లిబియా నుంచి అక్రమంగా నిధులు సేకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాటి లిబియా నియంత ముఅమ్మర్ గడాఫీ నుంచి సర్కోజీ మిలియన్ల కొద్దీ యూరోలను రహస్యంగా స్వీకరించారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ అక్రమ నిధులు ఆయన ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడ్డాయని కోర్టులో వాదనలు వినిపించారు. సంవత్సరాల తరబడి జరిగిన ఈ విచారణలో.. కోర్టు నేరపూరిత కుట్ర కింద సర్కోజీని దోషిగా నిర్ధారించింది. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడిపై వచ్చిన ఆరోపణ మాత్రమే కాదని.. చట్టబద్ధత, నైతికతకు సంబంధించిన అంశమని కోర్టు స్పష్టం చేసింది.
70 ఏళ్ల సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పని చేశారు. దేశ అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రుజువవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్య పరుస్తోంది. ఈ తీర్పుపై సర్కోజీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు తెలిపారు. అప్పీల్ దాఖలు చేస్తే తీర్పు అమలు ఆలస్యం కావచ్చు. అంతేకాకుండా ఆయన వయస్సును పరిగణనలోకి తీసుకుని, కొన్ని షరతులతో కూడిన విడుదల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసు సర్కోజీ రాజకీయ జీవితంపై చెరగని మచ్చను మిగిల్చింది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa