ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాళ్లకు ఒకలా, మాకు మరోలా' ,,,శాసనమండలిలలో కాఫీ, భోజనంపై ఆసక్తికర చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 07:42 PM

ఏపీ శాసనమండలిలో కాఫీపై వివాదం రేగింది. శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు మండలిలో ఇచ్చే కాఫీకి, శాసనసభలో ఇచ్చే కాఫీకి తేడా ఉందన్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసన తెలిపారు. రెండు చోట్లా ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవని ఆందోళన చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దీనిపై వివరణ ఇచ్చారు. అలాంటి తేడా ఎక్కడా లేదని.. ఒకవేళ చిన్న పొరపాట్లు ఉంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు. అయినా వైఎస్సార్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో సభ స్తంభించింది. ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.


వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. వారు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేశారు. మండలి చైర్మన్ గౌరవాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. గేటు నుండి కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ వచ్చారు. శుక్రవారం కూడా మండలిలో ప్రభుత్వం ఛైర్మన్‌ను అగౌరవపరుస్తోందని ఆరోపిస్తూ వారు ఆందోళన చేశారు. శాసన మండలి సమావేశాల్లో సభ మొదలవగానే ఛైర్మన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వెంటనే వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఛైర్మన్‌కు గౌరవం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నల్ల కండువాలతో సభకు వచ్చారు. ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగింది. మంత్రి పయ్యావుల బ్రేక్ సమయంలో చర్చలు సూచించారు. కానీ విపక్షనేత బొత్స సత్యనారాయణ ముందు చర్చలు జరపాలని పట్టుబట్టారు. దీంతో సభలో కాసేపు రగడ జరిగింది.


ప్రభుత్వం ఇటీవల నిర్వహించన రెండు కార్యక్రమాలకు మండలి ఛైర్మన్‌ను ఆహ్వానించలేదని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఇది ఆయనను అవమానించడమేనని.. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని శుక్రవారం మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన పార్లమెంట్ మహిళా సభ్యుల సదస్సు, శాసనసభా ప్రాంగణంలో జరిగిన ప్రభుత్వ విప్‌లు, మీడియా పాయింట్ భవనం ప్రారంభోత్సవానికి ఛైర్మన్‌ను పిలవలేదన్నారు. చైర్మన్ ఎస్సీ అయినందునే ఈ అవమానం జరిగిందని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపించారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని మండలిలో ప్రస్తావించారు.


ఈ అంశంపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ జోక్యం చేసుకున్నారు. "పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని" వారు చెప్పారు. అయితే, వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. సభలో చర్చ జరుగుతుండగా చైర్మన్‌ మోషేన్‌రాజు జోక్యం చేసుకున్నారు. తన సమక్షంలో చర్చించడం సరికాదన్నారు. ప్యానల్‌ ఛైర్మన్‌ను నియమించి చర్చించాలని సూచించారు. ఆ తర్వాత సభను కొద్దిసేపు వాయిదా వేశారు. మండలి ఛైర్మన్‌ను తప్పకుండా ఆహ్వానించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.సభ, మండలి కార్యక్రమాలకు ముఖ్యమంత్రికి సంబంధం ఉండదని.. స్పీకర్‌, ఛైర్మన్‌లు ప్రధానం అన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో అసెంబ్లీ సెక్రటరీని అడిగి తెలుసుకుంటామని తెలిపారు. సంబంధం లేని విషయాలను, వ్యక్తులకు ఆపాదించడం సరికాదని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa