ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రిటన్‌లో ఉద్యోగం పొందాలంటే ఆ కార్డు తప్పనిసరి': కీర్ స్టార్మర్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 09:02 PM

యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ అక్రమ వలసలను అరికట్టడానికి ఒక వినూత్న ప్రణాళికను ప్రకటించారు. జాతీయ పౌరులతో పాటు దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఉచితంగా డిజిటల్ ఐడీ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త గుర్తింపు కార్డు ఫోన్లలో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈచర్య అనధికారిక వలసలను అడ్డుకోవడంతో పాటు పన్ను పరిధిలోకి రాని ఆర్థిక కార్యకలాపాలు కూడా తగ్గిస్తుందని వెల్లడించింది. ఇది ఆరోగ్య, శిశు సంక్షేమ పథకాలతో పాటు ఇతర సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయనుంది.


ఈ డిజిటల్ ఐడీని అన్ని సందర్భాల్లో వెంట తీసుకువెళ్లాల్సిన, చూపించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఉద్యోగం చేసే హక్కును నిరూపించుకోవడానికి మాత్రం ఇది తప్పనిసరి అవుతుందని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా చట్టబద్ధమైన వలసదారులు, పౌరులు తమ స్థితిని సులభంగా నిరూపించుకోగలుగుతారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్సులు, శిశు సంరక్షణ, సంక్షేమ పథకాలు వంటి ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోవడాన్ని కూడా ఈ వ్యవస్థ మరింత సులభతరం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ డిజిటల్ గుర్తింపు పత్రం ద్వారా పౌరుల పన్ను రికార్డులను కూడా క్రమబద్ధీకరించవచ్చని ప్రణాళికలు చెబుతున్నాయి.


కీర్ స్టార్మర్ ఈ పథకాన్ని కేవలం వలసల సమస్యకు పరిష్కారంగానే కాకుండా యూకే పౌరులకు అనేక ప్రయోజనాలను అందించే ఒక భారీ అవకాశంగా అభివర్ణించారు. "డిజిటల్ ఐడీ అనేది యూకేకు ఒక గొప్ప అవకాశం. ఇది సామాన్య పౌరులకు లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విభజనను కాకుండా మార్పును కోరుకునే ప్రజల కోసం గట్టి కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అయితే ఈ డిజిటల్ ఐడీ అమలులో గోప్యత, డేటా భద్రత వంటి సమస్యలపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా భద్రపరుస్తుంది? ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం కచ్చితమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.


గతంలో బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని భారీ ఐటీ ప్రాజెక్టులు విఫలమైన అనుభవాల దృష్ట్యా.. ఈ పథకం అమలులో కూడా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఒక డిజిటల్ యూకేను సృష్టించడం ద్వారా దేశంలో మార్పు తీసుకు రావాలన్న లేబర్ పార్టీ లక్ష్యంలో ఈ డిజిటల్ ఐడీ ఒక ముఖ్యమైన అడుగుగా నిలవనుంది. భారతదేశంలోని ఆధార్ వంటి పథకాలను కూడా అధ్యయనం చేసి ఈ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఉద్యోగాలు, ఇళ్లు, ఇతర సేవల కోసం తప్పుడు గుర్తింపు పత్రాలను ఉపయోగించే నేరగాళ్లకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త డిజిటల్ ఐడీ 2029 నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa