ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరులో విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులు ప్రారంభించిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:50 PM

విమానాశ్రయాల ఏర్పాటుతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని, ఈ ప్రగతిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్థిక ప్రగతితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూప్ చేపట్టిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఇథనాల్ ప్లాంట్, నంద గోకులం లైఫ్ స్కూల్, సేవ్ ద బుల్, పవర్ ఆఫ్ బుల్ ప్రాజెక్టులను సీఎం ప్రారంభించి పరిశీలించారు. నంద గోకులం లైఫ్ స్కూల్ విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు కీలక పరిశ్రమలు వచ్చాయి. కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులు జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయి. దగదర్తి విమానాశ్రయం త్వరలోనే వస్తుంది. బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, క్రిబ్ కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతున్నాయి. రాష్ట్ర ప్రగతిలోరాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే సమయంలో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం లేదు. సోమశిల, కండలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 150 టీఎంసీల నీళ్లు ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉంటాయి. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉంచుతాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.“ఏ ప్రాజెక్టులు చేపట్టినా రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడడంతోపాటు పర్యావరణ హితంగా ఉండాలి. ఈ దిశగానే విశ్వసముద్ర మూడు ప్రాజెక్టులు చేపట్టింది. 24 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. దీని కోసం 15 వేల టన్నులకు పైగా పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్ధాల కొనుగోలు చేస్తోంది. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది. రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ విశ్వసముద్ర యాజమాన్యం దేశ ప్రగతికి తోడ్పడుతోంది. అలాగే పశు సంపదను కాపాడేందుకు కొత్త ప్రయోగం చేయటం అభినందనీయం. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గోవులను సంరక్షిస్తున్నారు. ఒంగోలు జాతి పశువులను సంరంక్షిచడంపై ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేయడమే కాకుండా శాస్త్రీయ పద్దతుల్లో పునరుత్పత్తికి చింతా శశిధర్ ఫౌండేషన్ పని చేస్తోంది. 'పవర్ ఆఫ్ బుల్' అనే విధానంలో విద్యుత్పత్తి చేపట్టడం వినూత్న ప్రక్రియ. ఈ విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 5 కిలోవాట్లను ఇన్ హౌస్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇక నంద గోకులం లైఫ్ స్కూల్ ద్వారా ప్రతిభ కలిగిన, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఉత్తమ విద్యను అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వటం అనే విధానంలో భాగమే పీ4. డబ్బులు ఇవ్వటం ఒక్కటే కాదు చేయూత ఇవ్వడమనేది పీ4 విధానంలో ముఖ్యమైన అంశం” అని చంద్రబాబు వివరించారు.“విశాఖకు ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. రూ.88 వేల కోట్లతో ఓ దేశచరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఆల్గారిథమ్స్ కూడా రాసేలా మన పిల్లలు సిద్ధం అవుతున్నారు. 2047కి భారత్ నెంబర్ 1 ఆర్ధిక వ్యవస్థగా తయారవుతుంది. ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు హజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa