ప్రపంచవ్యాప్తంగా వచ్చే ముప్పును పసిగట్టే సామర్థ్యం కలిగిన అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థను చైనా అభివృద్ధి చేసినట్టు సమాచారం. ‘డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ప్లాట్‌ఫామ్’గా పిలిచే ఈ గ్లోబల్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్ట్‌కు సమానమని ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ప్రపంచంలోనే ఇటువంటి వ్యవస్థను రూపొందించిన తొలి దేశంగా చైనా నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ అభివృద్ధి ఇంకాా ప్రారంభ దశల్లోనే ఉంది. అయితే, ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా చైనాపై ప్రయోగించే వెయ్యి క్షిపణులను ఒకేసారి గుర్తించి పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది.
అది 1980వ దశకం. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య జరుగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అణ్వాయుద ఉద్రిక్తతలతో ఇరు దేశాలూ ఒకరిపై ఒకరు దాడికి క్షిపణులు, అణు జలాంతర్గాములను సిద్ధం చేసుకున్నాయి. ఇటువంటి పరిస్థితిలో నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వ్యూహాత్మక రక్షణ ప్రణాళికను ప్రకటించారు. ఆయన వెల్లడించిన ‘స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్’ను ప్రపంచవ్యాప్తంగా ‘స్టార్ వార్స్’ అని పిలిచారు.
అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1983 మార్చి 23న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ‘మన సరిహద్దులు, తీరాలకు చేరకముందే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుని, నాశనం చేయగల ఒక వ్యవస్థ ఉందని ఊహించండి.. మన నగరాలను, మన ప్రజలను అణు దాడి నుంచి రక్షించగల ఒక వ్యవస్థ ఉందని ఊహించండి’ అని ప్రకటించారు. ఆయన చరిత్రాత్మక ప్రసంగం చేసిన ఎనిమిదేళ్లకే సోవియట్ యూనియన్ 1991లో విచ్ఛిన్నమైంది. దీంతో రోనాల్డ్ రీగన్ స్టార్ వార్స్ అటకెక్కింది.
మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇటీవలే మే 2025లో డొనాల్డ్ ట్రంప్ దీని గురించి ప్రస్తావించారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించేలా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగానే ‘గోల్డెన్ డోమ్’ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. మొత్తం 175 బిలియన్ డాలర్ల వ్యయంతో నాలుగు అంచెల రక్షణ వ్యవస్థను అంతరిక్షం వరకూ ఏర్పాటుచేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో ఒకటి ఉపగ్రహ ఆధారంగా, మిగతా మూడు భూమి మీద ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. దీనికి అదనంగా, 11 తక్కువ పరిధి కలిగిన రక్షణ బ్యాటరీలు అలాస్కా, హవాయ్ సహా అమెరికా ఖండంలోని విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు నివేదిక పేర్కొంది.
చేసిచూపించిన చైనా
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు తమ రక్షణ వ్యవస్థ పనిచేసే నమూనాను మోహరించారు. ఈ వ్యవస్థ అంతరిక్షం, సముద్రం, ఆకాశం, భూమిపై విభిన్న సెన్సార్లను ఉపయోగించి సంభావ్య ముప్పులను పసిగట్టి, విశ్లేషిస్తుంది. భూగ్రహం అంతటా విస్తరించి ఉన్న మొట్టమొదటి క్షిపణి రక్షణ వ్యవస్థ ఇదేనని, దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అభివృద్ధి చేసి, పరీక్షించి, మోహరించిందని నివేదిక పేర్కొంది. లేజర్ సహా వివిధ ఆయుధాలు, నిజమైన వార్‌హెడ్‌లా లేదా డెకోయ్‌లా? అనే కీలకమైన సమాచారాన్ని తక్కువ సమయంలో గుర్తించి, ఇంటర్‌సెప్షన్ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేస్తుందని నివేదిక పేర్కొంది.
ట్రంప్ గోల్డెన్ డోమ్ ప్లాన్‌లో అప్‌డేట్.. అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి పరీక్షించిన అమెరికా
‘ఈ ప్రోటోటైప్ వ్యవస్థ ఒకేసారి వెయ్యి డేటా ప్రాసెసింగ్ పనులను వివిధ నోడ్‌లపై విభజించి సమాంతరంగా నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని చైనాకు చెందిన అతిపెద్ద రక్షణ రంగ పరిశోధన సంస్థ నాంజింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వివరాలను సెప్టెంబర్ 2న చైనా సైంటిఫిక్ జర్నల్ మోడర్న్ రాడార్ పీర్-రివ్యూ పేపర్‌లో ప్రచురించారు.
‘‘ప్రస్తుతం ప్రోటోటైప్ ముందస్తు హెచ్చరిక, గుర్తింపు వ్యవస్థను వివిధ దశల్లో పరీక్షించారు. ఇది నిర్దేశిత లక్ష్యాలను సాధించి విజయవంతమైంది. దీని ద్వారా లభించే సమాచారంతో పీఎల్ఏ ప్రధాన కార్యాలయం సమగ్ర నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది’’ అని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భూమి, సముద్రం, వాయు, అంతరిక్షంలో విస్తరించి ఉన్న సమగ్ర, AI ఆధారిత క్షిపణి రక్షణ నెట్‌వర్క్‌ను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా గోల్డెన్ డోమ్ ప్రోగ్రామ్ ఇంకా తొలి దశలోనే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa