కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వచ్చి.. అకస్మాత్తుగా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇటీవలె కేరళకు వచ్చిన రైలా ఒడింగా.. బుధవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా.. గుండెపోటు రావడంతో కుప్పకూలి మరణించారు. 80 ఏళ్ల రైలా ఒడింగాకు ఆయుర్వేద వైద్యం అంటే నమ్మకం ఎక్కువ. గతంలో తన కుమార్తె చూపు సమస్యతో బాధపడగా.. ఆమెకు కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించారు. దీంతో ఆమెకు ఉన్న దృష్టి సమస్య తీరిపోవడంతో.. ఆయుర్వేదంపై ఇష్టం పెంచుకున్నారని ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితమే.. మళ్లీ ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు రాగా ఈ విషాదం చోటు చేసుకుంది.
కేరళలోని కొట్టాట్టకుళం ఆయుర్వేద కేంద్రానికి ఇటీవలె రైలా ఒడింగా కుటుంబంతో సహా వచ్చారు. ఆయన భార్య, కుమార్తెతో కలిసి వచ్చిన రైలా ఒడింగా.. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే గుండెపోటు కారణంగా ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇక ఆయన మరణానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి అధికారులు ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయన పార్థీవదేహాన్ని అదే ప్రైవేట్ ఆసపత్రిలో ఉంచారు.
ఎవరీ రైలా ఒడింగా?
1945 జనవరి 7వ తేదీన పుట్టిన రైలా ఒడింగా కెన్యా రాజకీయాల్లో ఒక గొప్ప నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కెన్యాలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుడిగా ఆయన 8 ఏళ్ల పాటు జైలుకు వెళ్లారు. 1992లో కెన్యా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రైలా ఒడింగా.. 2007 అధ్యక్ష ఎన్నికల తర్వాత చెలరేగిన హింసను చల్లార్చడానికి 2008 ఫిబ్రవరిలో కుదిరిన అధికార భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఆయన కెన్యా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2010లో కెన్యా కొత్త రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి రద్దు చేశారు. ఆయన 1997, 2007, 2013, 2017, 2022ల్లో.. ఐదుసార్లు కెన్యా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. చివరి 4 ఎన్నికల్లోనూ తాను మోసపోయినట్లు ప్రకటించారు.
రైలా ఒడింగా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
రైలా ఒడింగా మరణవార్త తెలుసుకుని ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ప్రియ మిత్రుడు.. కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా మరణవార్త విని తాను చాలా బాధపడినట్లు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. రైలా ఒడింగా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడని.. మన దేశానికి ప్రియమైన మిత్రుడని కొనియాడారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి.. ఆయనతో పరిచయం ఉందని.. భారతదేశం అన్నా.. భారత సంస్కృతి, విలువలు, ప్రాచీన జ్ఞానంపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆయుర్వేద చికిత్సతో తన కుమార్తె జబ్బు నయం కావడంతో ఆయన ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంపై ఇష్టం పెంచుకున్నారని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కెన్యా ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
రైలా ఒడింగా కుమార్తెకు ఆయుర్వేద చికిత్స
రైలా ఒడింగా కుమార్తె రోజ్మేరీ ఒడింగాకు గతంలో ఆయుర్వేద చికిత్స అందించారు. 2017లో రోజ్మేరీ ఒడింగాకు మెదడులో వచ్చిన సమస్య కారణంగా.. ఆమె కంటి నాడిపై ఒత్తిడి పడి.. దృష్టి సమస్య తలెత్తింది. కంటి నాడులు దెబ్బతినడంతో ఆమె కంటి చూపును కోల్పోయారు. దీంతో ఆమెకు కెన్యాతోపాటు.. దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్, చైనా, జర్మనీ వంటి అనేక దేశాల్లో చికిత్స అందించినా ఫలితం కనిపించలేదు. దీంతో 2019లో కేరళ కొట్టాట్టకుళంలోని శ్రీధరీయం ఆయుర్వేదిక్ కంటి ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్లో చేర్పించారు.
అక్కడ ఆమెకు.. ఆయుర్వేద మెడిసిన్‌తోపాటు కళ్లు, తల మసాజ్ చేయడం ప్రారంభించారు. ఆయుర్వేద చికిత్సలో భాగంగా తైలా ధారా అంటే ఔషధ నూనె లేదా మూలికా ద్రవాలను ఉపయోగించారు. ముక్కులో నుంచి కూడా కొన్ని మందులు వేసినట్లు తెలుస్తోంది. 3 వారాల పాటు ఒక సెషన్ చొప్పున మొత్తం 6 వారాల పాటు 2 సెషన్లలో రోజ్మేరీ ఒడింగాకు చికిత్స అందించారు. దీంతో ఆమెకు క్రమక్రమంగా కంటి చూపు రావడం మొదలైంది. దీంతో కళ్లద్దాలు పెట్టుకుని ఆమె స్పష్టంగా చూడగలిగారు.
దీంతో ఆయుర్వేద వైద్యం తనకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ సాంప్రదాయ చికిత్సలను కెన్యాతోపాటు ఆఫ్రికా దేశాలకు విస్తరించాలనే ఆసక్తిని ఆమె వ్యక్తం చేశారు. చికిత్స కోసం స్వదేశీ మొక్కలను ఉపయోగించాలని.. కెన్యాలో శ్రీధరీయం లాంటి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సాధ్యమైన సహకారాన్ని కూడా అందిస్తామని రైలా ఒడింగా ప్రతిపాదనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa