ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెల్లవారుజామున.... తలుపు తీసిన మహిళకు నిద్ర మొత్తం ఎగిరిపోయిందిగా

Crime |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 08:29 PM

చీకట్లను చీల్చుకుంటూ తూరుపు వైపున భానుడు ఉదయిస్తున్నాడు.. దూరంగా గుడిలో నుంచి శ్రావ్యంగా వినిపిస్తున్న భక్తి పాటలు.. దగ్గరగా చెవుల్లో మార్మోగుతున్న కోడికూత.. అసలే చలికాలం.. ఆపై వేకుమజాము.. కోడి కూతేమో లేవమంటోంది.. నిద్ర దేవతేమో వద్దొద్దు అంటోంది.. అంత నిద్రమత్తులోనూ పొద్దున్నే చేయాల్సిన పనులు గుర్తొచ్చాయి కమలమ్మకు ( పేరు మార్చాం). దీంతో నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది.. ఠపీమని నిద్ర లేచింది. చుట్టూ చూస్తే అందరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు.. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దనుకుంది కమలమ్మ. సిటీకల్చర్‌కు దూరంగా.. అభివృద్ధికి ఆమడ దూరంలో.. 6జీలు, 5జీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అసలే తెలియని ప్రపంచమది.. మొత్తంగా చెప్పాలంటే సగటు అమాయకపు భారతీయ పల్లె.. కానీ.. ఆ పల్లెలో ఆరోజు కలకలం రేగింది. దానికి కమలమ్మే ఇల్లే వేదిక అవుతుందని ఆమె ఊహించలేకపోయింది..


నిద్రమత్తులో ఉన్న కమలమ్మకు ఉదయం నిద్ర లేస్తూనే ఇంటి ముందు కళ్లాపి చల్లి.. ముగ్గు వేయడం అలవాటు.. యథాలాపంగా ఇంటి ముందు ముగ్గు వేసేందుకు తలుపు తీసింది కమలమ్మ.. కానీ అక్కడ చూసిన దృశ్యంతో కమలమ్మకు నోట మాట రాలేదు. ఒళ్లంతా చెమటలు.. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది.. అప్పటి వరకూ కాస్తోకూస్తో ఉన్న నిద్రమత్తు.. కోల్గేట్‌ పేస్టుతో బ్రష్ చేసుకుంటే ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోయింది.. నోట మాట పెగలడం లేదు.. కాళ్లూ చేతులు ఆడటం లేదు.. శరీరం మొత్తాన్ని భయం ఆవహించింది...


అంతటి భయంలోనూ ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలుక్కుంటూ.. అ..మ్మ.. బాబోయ్.. పుర్రె.. అని గట్టిగా అరిచింది కమలమ్మ.. దీంతో ఇంట్లో నిద్రపోతున్న వారంతా పరుగుపరుగున అక్కడకు చేరుకున్నారు.. క్షణాల్లోనే ఈ వార్త దావానలంలా ఊరంతా వ్యాపించింది. ఆ రోజు ఉదయం.. ఆ ఊరు మొత్తం కమలమ్మ ఇంటి ముందు వాలిపోయింది..


విజయనగరం జిల్లా పెదతాడివాడ పంచాయతీలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ ఇంటి యజమాని, కుటుంబసభ్యులు ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి కూడా నిద్రపోయారు. సోమవారం ఉదయం తెల్లారేసరికి ఇంటి ముందు పుర్రె.. దానికి కుంకుమ, పసుపు రాసి ఉంది. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు భయపడిపోయారు. అయితే ఎవరు ఈ పనికి పాల్పడ్డారనే ఇంకా తెలియరాలేదు. ఆకతాయిల పనా లేక క్షుద్రపూజలు గట్రా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్థానిక పోలీసులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa