ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి ఏకంగా వేల కోట్ల ప్రాజెక్టులు..శుభవార్తలు మోసుకొస్తున్న మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 08:34 PM

ఏపీకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీపికబుర్లు మోస్తుకొస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 16) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సాగనుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఏపీకి శుభవార్తలను అందించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ రూ.13,400 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎక్స్‌లో తెలుగులో ట్వీట్ చేశారు మోదీ..


"రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి " అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


కర్నూలు జిల్లాలో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇండస్ట్రీ, పవర్ ట్రాన్స్‌మిషన్, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగ తయారీ, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.


కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్


గురువారం ఉదయం 11:15 గంటలకు శ్రీశైలం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రధాని మోదీ పూజలు, దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం కర్నూలుకు వెళ్లనున్న మోదీ.. మధ్యాహ్నం 2:30 గంటలకు రూ. 13,430 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.


కర్నూలు-III పూలింగ్ స్టేషన్‌లో రూ.2,880 కోట్ల పెట్టుబడితో ప్రసార వ్యవస్థను బలోపేతం చేసే ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 765 KV డబుల్-సర్క్యూట్ కర్నూలు-III పూలింగ్ స్టేషన్-చిలకలూరిపేట ట్రాన్స్‌మిషన్ లైన్ నిర్మాణం ఉంది.కర్నూలులోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్, కడపలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు, మొత్తం రూ. 4,920 కోట్ల పెట్టుబడితో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షింవచ్చని.. సుమారు లక్ష ఉద్యోగాలను కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.


అలాగే సబ్బవరం నుంచి షీలానగర్ వరకు రూ.960 కోట్లతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ప్రధాని మోదీ రేపు శంకుస్థాపన చేస్తారు. అలాగే పీలేరు-కాలూరు సెక్షన్‌ను నాలుగు లైన్లుగా విస్తరించడం, NH-165లో గుడివాడ నూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు లైన్ల రైల్ ఓవర్ బ్రిడ్జి (ROB), NH-716లో పాపాగ్ని నదిపై ప్రధాన వంతెన, NH-565లో కనిగిరి బైపాస్, NH-544DDలోని N. గుండ్లపల్లి టౌన్‌లోని బైపాస్డ్ సెక్షన్‌ను మెరుగుపరచడం వంటి రూ.1,140 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా పలు రైల్వే ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa