దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరవు భత్యం లో ఒక విడతను విడుదల చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం, ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచారు. ఈ పెంపుదల 2024 జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా 3.64 శాతం కరవు సహాయం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డీఏ బకాయిలలో ఒకదానిని విడుదల చేస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ పండగ సమయంలో ఈ డీఏను మంజూరు చేయడం గమనార్హం. పెంచిన డీఏకు సంబంధించిన బకాయిలను కూడా త్వరలోనే ఉద్యోగులకు చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa