దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ముంబయి 26/11 తరహాలో ఢిల్లీలో పేలుళ్లకు ముష్కర మూకలు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ముంబయి నగరంలో 2008 నవంబరు 26న తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ సహా 12 చోట్ల ముష్కరులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల టార్గెట్ లిస్ట్‌లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి చారిత్రక, ప్రముఖ కట్టడాలు ఉన్నట్లు భద్రతా దళాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.
ఈ దాడుల కోసం భారీగా బాంబులను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నాయి. మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసుకొని మతకలహాలను రేపేందుకు కుట్ర పన్నుతున్నారని వనరులు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్, అనంతనాగ్ ప్రాంతాలకు చెందిన తీవ్రవాద భావజాలానికి ప్రభావితులైన వైద్యులను ఈ పనికి ఎంపిక చేసినట్లు కూడా సమాచారం. వీరంతా ఫరీదాబాద్‌లోనే తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. దీని వల్ల ఎవరికీ అనుమానం రాకుండా ఢిల్లీలోకి సులభంగా ప్రవేశించవచ్చని భావించారు.
నవంబరు 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా పలువురు అనుమానితులు, నిందితులను భద్రతా దళాలు విచారించి వారి నుంచి కీలక సమాచారం రాబడుతున్నాయి. పేలుడుకు కారణమైన డాక్టర్లు ఉగ్ర మాడ్యూల్ వెనక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దేశ రాజధానిలో వరుస పేలుళ్ల కోసం తీవ్రవాదులు జనవరి నుంచి వ్యూహరచన చేస్తున్నట్లు విచారణలో వెల్లడయినట్టు సమాచారం.
ఈ ఉగ్రవాద మాడ్యూల్ అత్యంత శక్తిమంతమైన 200 బాంబులు (ఐఈడీల)ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. రాజధానిలో ఎర్రకోట, ఇండియా గేట్, గౌరీశంకర్ ఆలయం, కాన్స్టిట్యూషన్ క్లబ్ సహా దేశంలోని పలు ముఖ్యమైన రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు ఈ మాడ్యూల్ కుట్ర పన్నుతున్నట్లు పేర్కొన్నాయి.
ఇటీవల జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అమ్మోనియం, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన ఏకంా 2,900 కిలోల పేలుడు పదార్థాలను ఈ టెర్రర్ మాడ్యూల్ నుంచి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఢిల్లీలో పేలుడు ప్రదేశం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. వాటిలో కూడా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు సహా అత్యంత శక్తిమంతమైన పేలుడుకు కారణమయ్యే మరో రసాయనం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు కేంద్రం అప్పగించింది. దీంతో 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఎన్ఐఏ ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. నిందితుల కదలికలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో నవంబరు 12న సాయంత్రం ఇంటెలిజెన్స్ బ్యూరో డీజీతో ఎన్ఐఏ చీఫ్ కీలక భేటీ నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa