బీహార్ శాసనసభ ఎన్నికల తుది ఫలితాల్లో ఎన్డీఏ ఎవరూ ఊహించని స్థాయిలో సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 200 మార్కును దాటి డబుల్ సెంచరీ చేసింది. అయితే ఇందులో మరో ఆశ్చర్యకరమైన అంశం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీరామ చంద్రుడికి ఆంజనేయుడిలా.. మోదీకి చిరాగ్ పాశ్వాన్ నిలిచారు. ఒకప్పుడు ఒకే ఒక సీటుకు పరిమితమై.. రాజకీయాల్లో వెనక్కి నెట్టబడ్డారని భావించిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా 22 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతూ ఎన్డీయే కూటమికి అత్యంత బలమైన భాగస్వామిగా ఉద్భవించింది.
ఈ అనూహ్య విజయం చిరాగ్ పాశ్వాన్‌కు అప్పటి వరకు అంటగట్టిన 'ఓటు కట్టర్' అనే ముద్రను చెరిపివేసింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలోని బీజేపీ, జేడీ(యూ)లతో కలిసి పోటీ చేసిన ఎల్జేపీ(ఆర్వీ) చరిత్రలో ఇదే అత్యుత్తమ అసెంబ్లీ ఎన్నికల ప్రదర్శనగా నిలిచింది. ఈ భారీ పురోగతి అధికార కూటమి గెలుపు ఉత్సాహాన్ని మరింత పెంచడమే కాకుండా.. పాట్నాలోని రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది.
2020 ఎన్నికలతో పోలిస్తే ఇది నాటకీయ మలుపుగా నిలుస్తోంది. అప్పటి ఎన్నికల్లో చిరాగ్ ఒంటరిగా 137 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒకే ఒక్క సీటు గెలిచారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆయన ప్రచారం.. జేడీ(యూ) ఓట్లను చీల్చడం ద్వారా ఆ పార్టీ బలం 71 నుంచి 43 స్థానాలకు పడిపోవడానికి దోహదపడింది. కానీ ఈసారి ఎల్జేపీ(ఆర్వీ) కేవలం 'స్పాయిలర్' పాత్రకే పరిమితం కాలేదు. వారికి కేటాయించిన 29 సీట్లలో 22 స్థానాల్లో ఆధిక్యం సాధించడం ద్వారా.. ఆ నిర్ణయం సరైనదేనని రుజువు చేశారు. ఈ ఫలితాలు చిరాగ్‌ను ఈ ఎన్నికల కీలక విజేతలలో ఒకరిగా నిలబెట్టాయి.
పార్టీలో అంతర్గత గొడవలు, బాబాయ్ పశుపతి నాథ్ పరాస్‌తో చీలిక తర్వాత చిరాగ్ రాజకీయంగా తన బలాన్ని క్రమంగా పునరుద్ధరించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్డీయేలోకి తిరిగి వచ్చి, పార్లమెంట్ స్థానం గెలుచుకుని, మోదీ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 43 ఏళ్ల చిరాగ్ గతంలో నితీష్ కుమార్‌పైనే అభ్యంతరం ఉందని.. ప్రధాని నరేంద్ర మోదీ లేదా బీజేపీతో కాదని పదేపదే చెప్పారు.
ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆ వైరాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన పార్టీ ఉత్తర, మధ్య, దక్షిణ బీహార్‌లలోని బహదూర్‌గంజ్, గోవింద్‌గంజ్, మహువా, బఖ్తీయార్‌పూర్ వంటి కీలక నియోజక వర్గాల్లో ముందంజలో ఉంది. ఈ ధోరణులు కొనసాగితే.. గతంలో అంచున ఉన్న రాజకీయ శక్తి ఇప్పుడు సుస్థిరమైన ఓటు బ్యాంకుతో బలమైన ఎన్డీయే మిత్రపక్షంగా మారినట్లు చరిత్రలో నిలిచిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa