ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదిలో స్నానాలకు దిగుతున్నారా,,,, అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ సూచన

national |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 08:38 PM

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో నవంబరు 17 నుంచి మండల మకరు విలక్కు పూజల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు కేరళ ప్రభుత్వం పూర్తిస్థాయి హెల్త్ అడ్వైజరీ జారీచేసింది. ముఖ్యంగా నదీ స్నానాల్లో దిగేటప్పుడు అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించింది. రాష్ట్రంలో బ్రెయిన్ ఫీపర్ (అమీబా మెనింజో‌ఎనసెఫలైటస్) వ్యాధి కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం ఈ సూచనలు చేసింది. అలాగే, అనారోగ్యం బారినపడి చికిత్స తీసుకున్నవారు తమ ఆరోగ్య రికార్డులను, ఔషధాలను వెంట తీసుకెళ్లాలని కోరింది. రోజువారీ వాడుతున్న ఔషధాలను యాత్ర సమయంలో నిలిపివేయకూడదని తెలిపింది. ‘‘నదుల్లో స్నానం చేసేటప్పుడు భక్తులు తమ ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత వహించాలి’’ అని అడ్వైజరీలో పేర్కొంది. నిర్దిష్ట కారణం ప్రస్తావించకపోయినప్పటికీ, కేరళలో తరచుగా బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదైనప్పుడు ఇలాంటి సూచనలు గతంలో జారీ చేశారు. నవంబరు 17 నుంచి జనవరి 20 వరకు శబరిమల ఆలయం తెరుచుకోనున్న సంగతి తెలిసిందే.


శ్రమ ఆధారిత ఆరోగ్య ముప్పును తగ్గించడానికి శబరియాత్రకు ముందు రోజుల్లో నడక వంటి తేలికపాటి వ్యాయామం చేయాలని సిఫార్సు చేసింది. నిదానంగా కొండ ఎక్కి, అవసరమైన చోట విశ్రాంతి తీసుకోవాలని, అలసట, గుండె నొప్పి, ఊపిరాడకపోవడం, నీరసం వంటి ఏదైనా ఇబ్బంది తలెత్తినా సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సహాయం తీసుకోవాలని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భక్తులు 04735 203232 నెంబరును సంప్రదించాలని కోరింది.


అలాగే, వేడిచేసిన నీళ్లు మాత్రమే తాగాలని, ఆహారం తినడానికి ముందు కాళ్లుచేతులు కడుక్కోవాలని, పండ్లను తినేటప్పుడు శుభ్రంగా నీటితో కడగాలని, మూతలేని లేదా నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దని సూచించింది. బహిరంగ మలవిసర్జన నిషేధమని, ప్రతి ఒక్కరూ టాయ్‌లెట్‌లను వినియోగించి, పరిశుభ్రత పాటించాలని, వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. ఒకవేళ పాము కాటుకుగురైతే వెంటనే వైద్యసాయం తీసుకోవాలని పేర్కొంది.


కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలకు చెందిన వైద్యులను, శిక్షణ పొందిన స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలను యాత్రా మార్గాల వెంట నియమించామని, పాంపాలో 24 గంటల కంట్రోల్ సెంటర్ కూడా పనిచేస్తోందని చెప్పారు. ‘‘కొండ ఎక్కే సమయంలో ఏవైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలని సూచిస్తున్నాం. అవగాహన కోసం మలయాళం, ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది’’ అని ఆమె తెలిపారు.


ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సమన్వయంతో అవసరమైన వైద్య సౌకర్యాలను ఏర్పాటుచేశామని మంత్రి తెలిపారు. పంపా-సన్నిధానం మార్గంలో కోన్ని మెడికల్ కాలేజీ బేస్ హాస్పిటల్ సహా ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పథనంతిట్టా జనరల్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ కార్డియాలజీ సేవలు, క్యాథ్ ల్యాబ్, కార్డియాక్ ఎమర్జెన్సీ, స్పెషల్ అంబులెన్స్ సర్వీసులు, ప్రస్తుతం పనిచేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa