ప్రపంచంలోనే చాలా రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తున్న చైనా .. తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించింది. వరుసగా బంగారు నిక్షేపాలను కనుగొంటూ.. ప్రపంచానికి బంగారు ఆశలు కల్పిస్తోంది. టెక్నాలజీ, పరిశోధనలతో.. తమ భూభాగంలో ఉన్న బంగారం, ఇతర విలువైన లోహాలకు సంబంధించిన నిల్వలను గుర్తించే పనిలో చైనా శాస్త్రవేత్తలు మునిగిపోయి ఉన్నారు. ఇప్పటికే గత ఏడాది కాలంగా రెండు గోల్డ్ మైన్స్‌ను గుర్తించగా.. తాజాగా మరొక బంగారు నిల్వను కనుగొన్నారు. చైనాలోని జిన్‌జియాంగ్ సమీపంలో ఉన్న పవిత్రమైన కున్-లున్ పర్వతాల శ్రేణిలో 1000 టన్నులకు పైగా నిల్వలు ఉండే అవకాశం ఉన్న ఒక అరుదైన బంగారు నిక్షేపాన్ని గుర్తించారు.
పురాణాల ప్రకారం భూమిపై ఉన్న సంపదలకు నిలయంగా భావించే ఈ కున్ లున్ పర్వతాలపై ఉన్న నమ్మకానికి ఈ ఆవిష్కరణ శాస్త్రీయ ఆధారాన్ని ఇచ్చింది. ఈ బంగారు నిక్షేపం.. గత ఏడాది కాలంలో చైనా ప్రకటించిన మూడో అతిపెద్ద బంగారు నిల్వ కావడం మరో విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), శక్తివంతమైన గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్, శాటిలైట్లు వంటి అధునాతన డీప్-ఎర్త్ ప్రోస్పెక్టింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా చైనా ఈ విజయాలను సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు నిల్వలు మరింత పెంచే సామర్థ్యం ఈ ఆవిష్కరణలకు ఉందని పేర్కొంటున్నారు.
పశ్చిమ జిన్‌జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ ప్రాంతంలో ఉన్న పవిత్ర కున్-లున్ పర్వతాల్లో ఈ అరుదైన బంగారు నిక్షేపాన్ని కనుగొన్నట్లు చైనా ప్రభుత్వ భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఆవిష్కరణ చైనా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ బంగారు మార్కెట్‌కు ఒక కీలక పరిణామంగా నిలుస్తుందని తెలిపారు. చైనీస్ పురాణాల్లో.. కున్-లున్ పర్వతాలను గ్రీకు పురాణాలలోని మౌంట్ ఒలింపస్‌తో పోల్చేవారు. క్లాసిక్ ఆఫ్ మౌంటెన్స్ అండ్ సీస్ అనే పురాతన గ్రంథం ప్రకారం.. భూమిపై ఉన్న సంపదలన్నింటికీ నిలయం ఈ పర్వతాలు అని భావించేవారు.
జిన్‌జియాంగ్ ప్రాంతలో యూరేసియన్ ఖండపు భౌగోళిక కేంద్రం ఉన్నప్పటికీ.. బంగారు నిక్షేపాలకు సంబంధించి ఇంతకుముందు శాస్త్రీయ ఆధారం దొరకలేదు. కానీ తాజాగా కుయోకేజిలేగా అనే ప్రాంతంలో ఈ అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ చైనా టెక్నాలజీ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. చైనా జియాలజిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్ వ్యవస్థలు, అత్యంత సున్నితమైన ఖనిజ అన్వేషణ ఉపగ్రహాలను ఉపయోగించి వీటిని కనుగొన్నారు.
2018లో నిర్మించిన ఒక భారీ, క్రాస్-షేప్డ్ యాంటెన్నా శ్రేణి ద్వారా అనేక కిలోమీటర్ల లోతు వరకు విద్యుదయస్కాంత తరంగాలను పంపించి.. భూమి పొర కింద ఖనిజ నిక్షేపాలను కచ్చితత్వంతో మ్యాప్ చేయగలిగే డీప్-ఎర్త్ టెక్నాలజీ సామర్థ్యం చైనాకు ఉంది. ఈ డీప్-ఎర్త్ టెక్నాలజీ సామర్థ్యం ప్రస్తుతం ప్రపంచంలోని మరే ఇతర దేశానికీ లేకపోవడం గమనార్హం.
ఈ నిక్షేపం బయటపడటంతో గత ఏడాది కాలంలో చైనా ప్రకటించిన 1,000 టన్నుల పరిమితిని మించిన మూడో అతిపెద్ద బంగారు నిల్వగా మారింది. అంతకుముందు లియోనింగ్, హునాన్ ప్రావిన్స్‌లలో కూడా ఇలాంటి భారీ బంగారు నిల్వలను కనుగొన్నారు. చైనాలో కేవలం 3 వేల టన్నుల బంగారమే మిగిలి ఉందని అంతకుముందు బంగారు పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి.
కానీ ఇలా వరుసగా వెలువడుతున్న కొత్త కొత్త బంగారు నిల్వలతో చైనా మొత్తం బంగారు నిల్వలు అంతకుముందు అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంటున్నాయి. ఈ టెక్నాలజీని బంగారం మాత్రమే కాకుండా.. లిథియం, యురేనియం సహా ఇతర అరుదైన లోహాల వంటి కీలక వనరుల అన్వేషణలో కూడా చైనాకు ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచంలో సప్లై చైన్‌లో చైనా స్థానాన్ని మరింత బలోపేతం చేయనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa