ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొత్తం కశ్మీరీలను నేరస్థుల్లా చూస్తున్నారు.. సీఎం ఒమర్ ఆవేదన

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 08:17 PM

కొద్దిమంది ఉగ్రవాద చర్యలతో మొత్తం కశ్మీరీలకు చెడ్డ పేరు తీసుకొస్తోందని, ఇతర ప్రాంతాలవారు తమతో మాట్లాడటానికీ, కలిసిమెలసి ఉండటానికీ కూడా వెనుకడుగు వేస్తున్నారని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి వైద్యులు సహ వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లోని అనుమానితులు చాలా మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారే ఉన్న సంగతి తెలిసిందే. పేలుడు సమయంలో కారు నడిపిన వైద్యుడు డాక్టర్ ఉమర్ నబీ పుల్వామాకు చెందినవాడు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేశారు. ‘కొంత మంది మాత్రమే దీనికి బాధ్యులు.. కానీ ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు దాంతో మనమంతా బాధ్యులమన్న భావన కలుగుతోంది’ అని జమ్మూ కశ్మీర్ సీఎం వాపోయారు.


జమ్మూ కశ్మీర్‌కు 2019లో ప్రత్యేక హోదాను రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన తర్వాత ఉగ్రవాద దాడులు పూర్తిగా నిలిచిపోతాయని కేంద్రం ప్రకటించింది కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుత పరిస్థితి గురించి ఏమి చెప్పగలం? అది (ఉగ్రదాడి) ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరగకపోతే ఇక్కడే (కశ్మీర్‌లో) జరుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. బాంబు పేలుళ్లు, పౌరుల హత్యలు ఇంకా ఆగలేదని ఆయన ఆవేదనకు గురయ్యారు.


‘‘ఇది ఆగాలని మేము కోరుకుంటున్నాం.. కశ్మీర్‌లో ఎంతో రక్తపాతం చూశాం… ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ పిల్లలను కశ్మీర్ వెలుపలకు పంపాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఎక్కడికెళ్లినా మనపై అనుమానంతోనే చూస్తున్నారు. కశ్మీరీలను దూషిస్తున్నారు’’ అనిజమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.


‘ఢిల్లీలో ఏం జరిగిందో చూస్తే కొంత మంది దానికి బాధ్యులు.. కానీ అందర్నీ (కశ్మీరీలు) బాధ్యలు చేసేలా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.. జమ్మూ కశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం ఢిల్లీలో నడిపితే నేరంగా పరిగణిస్తున్నారు..నా కారును బయటకు తీయాలా? వద్దా? అని కూడా నేను ఆలోచించాలి. నన్ను ఎవరు ఆపి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడ ఏం చేస్తున్నాను అని ప్రశ్నించవచ్చు’ అని ఒమర్ అబ్దుల్లా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.


కాగా,ఎర్రకోట పేలుడుపై ఒమర్ తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాచేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చకు దారితీశారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత జరిగిన ఈ ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ... ఆ వైద్యులు ఉగ్రవాదాన్ని ఎందుకు ఎంచుకున్నారనే కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.


‘‘దీనికి బాధ్యులెవరో వారిని అడగండి… ఆ డాక్టర్లు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కారణం ఏంటి? దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు, విచారణ అవసరం’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఇటీవల జరిగిన టెర్రర్ మాడ్యూల్ అరెస్టుల తర్వాత మరో ఆపరేషన్ సిందూర్ జరిగే అవకాశం కూడా ఉందని అన్నారు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌పై దర్యాప్తు లోతుగా సాగుతోంది. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆ విద్యా సంస్థ ఆర్థిక వ్యవహారాలు సహా అన్నింటినీ అధికారులు శోధిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa