దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూక భారత్‌పై మరో దాడికి ఆత్మాహుతి బాంబర్లు లేదా ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తోందని, అందుకోసం నిధులు సేకరిస్తోందని నిఘా వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ యూపీఐ యాప్ సదాపే సహా వంటి డిజిటల్ మార్గాల్లో విరాళాల సేకరణ జరుపుతోందిన ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు, మహిళ నాయకత్వంలో ఆత్మాహుతి దాడికి కుట్రచేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్‌లోని జైషే, లష్కరే, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మసూద్అజార్ సోదరి సాదియా నేతృత్వంలో జైషే ఉగ్రవాద సంస్థ ‘జమాత్ ఉల్-ముమినాత్’ పేరుతో మహిళా విభాగం ఏర్పాటుచేసింది. ఎర్రకోట పేలుడులో కీలక నిందితుల్లో ఒకరైన డాక్టర్ షహినా సయీద్ ‘మేడమ్ సర్జన్’ అనే కోడ్ నేమ్‌తో దాడికి నిధులు సమకూర్చి ఉండొచ్చని అనుమానిస్తారు. భారత్‌లో జమాత్ ఉల్-ముమినాత్ బాధ్యతలను డాక్టర్ షహీన్ చేపట్టినట్టు సమాచారం.
‘ముజాహిద్’ అంటే పోరాట యోధుడికి.. వింటర్ కిట్ ఎవరైనా అందిస్తే వారిని 'జిహాదీ'గా పరిగణిస్తామని, విరాళాలు ఇవ్వాలని జైషే నేతలు కోరినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన 'జిహాదీ' పట్ల సానుభూతి చూపించే ఎవరినైనా 'జిహాదీ'గా భావిస్తామని చెప్పినట్టు సమాచారం.
‘విరాళం’ పేరుతో తీసుకునే మొత్తం సుమారు 20,000 పాక్ రూపాయిలు (అంటే దాదాపు భారత్ కరెన్సీలో రూ.6,400) ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తంతో ఆత్మాహుతి దాడికి ముందు లేదా తర్వాత ఒక ఉగ్రవాదికి అవసరమైన బూట్లు, ఉలెన్ సాక్స్, మ్యాట్రెసెస్, టెంట్ వంటి సామగ్రిని కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
ఎర్ర కోట పేలుడు నిందితుల డాక్టర్ల బృందం వంటి ఉగ్ర మాడ్యూల్స్‌కునిధులను వేగంగా అందజేయడం కూడా దీని ఉద్దేశమని తెలిపారు. డిజిటల్ మార్గాన నిధులను తక్షణం పంపించేందుకు వీలుగా ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. ఈ డిజిటల్ ఫండింగ్ నెట్‌వర్క్‌పై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీలో నవంబరు 10న జరిగిన కారు పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కారును నడిపింది జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించారు. దాడికి ముందు ఆత్మాహుతి దాడి అంటే బలిదానమంటూ పేలుడుకు ముందు మాట్లాడి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
నిఘా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ మద్దతున్న ఉగ్రవాదుల ఉనికి మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. జైషే, లష్కరే తొయిబా వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థలు దాడుల కోసం తమ నెట్‌వర్క్‌ను సమన్వయం చేసుకుంటూ మోహరింపులు చేపడుతున్నట్లు నివేదికలు సూచించాయి. ఈ రెండు కూడా పాక్ ప్రభుత్వ, ఆర్మీ నుంచి ఆర్థిక సహకారం, వ్యూహాత్మక మద్దతు పొందే ప్రముఖ ఉగ్రవాద సంస్థలే. గత ఆరు నెలల్లో పలు దాడులతో భారత్‌లో ప్రధాన శీర్షికల్లో ఇవి నిలిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa