యూఏఈలోని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC) లో అట్టహాసంగా కొనసాగుతున్న దుబాయ్ ఎయిర్ షో–2025లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. షోలో భాగంగా విన్యాసాలు చేస్తున్న భారతదేశానికి చెందిన తేజస్ యుద్ధ విమానం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాద ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల బృందాలు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలను ప్రారంభించాయి.దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ అద్భుత విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా ఈ శాకింగ్ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. కుప్పకూలిన వెంటనే ప్రాంతమంతా నల్లటి పొగతో నిండిపోయింది, వెంటనే సైరన్లు మోగాయి. ఈ ఘటనపై భారత వైమానిక దళం స్పందిస్తూ కోర్ట్ ఆఫ్ ఎన్‌క్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:49 గంటలకు అల్ మక్ టౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది.పైలట్ మరణాన్ని IAF అధికారికంగా నిర్ధారిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించింది. ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ నెగటివ్ G-టర్న్ తీసుకునే సమయంలో సమస్య తలెత్తి ఉండొచ్చని తెలుస్తోంది. పైలట్లు అత్యవసర పరిస్థితుల్లో నెగటివ్ G మానవర్లను ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.తేజస్ ఫైటర్ జెట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అత్యంత సామర్థ్యవంతమైన స్వదేశీ యుద్ధ విమానాలుగా పేరు తెచ్చుకున్న ఇవి గత 24 ఏళ్లలో కేవలం రెండుసార్లే కుప్పకూలాయి. చివరిసారిగా 2024 మార్చి 12న రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ఒక తేజస్ జెట్ ప్రమాదానికి గురైంది. దీంతో 20 నెలల వ్యవధిలో ఈ రెండో ప్రమాదం నమోదైంది.ఇక దుబాయ్ ఎయిర్ షో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారి 2023లో నవంబర్ 13 నుంచి 17 వరకు జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa