ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ బీపీ ఎంత దాటితే గుండెపోటు వస్తుందో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 10:48 PM

మారిన బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, జీవనశైలి మార్పులు, తిండి అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అలాంటి సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. హై బీపీ తరచుగా గుండెపోటుకు.. ఒక ప్రమాద కారకంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని WHOతో పాటు అమెరికా హార్ట్ అసోసియేషన్ కూడా చెబుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె కండరాలకు రక్త సరఫరా అంతరాయం కారణంగా తలెత్తే తీవ్రమైన పరిస్థితి. అధిక రక్తపోటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు ధమనులపై ఒత్తిడిని పెంచుతుంది. వాటిని దెబ్బతీస్తుంది.


గుండె కండరాలకు ఆక్సిజన్, ఇతర పోషకాల సరైన సరఫరాను నిరోధిస్తుంది. ఇది గుండెపోటుకు కారణమవుతుంది. అధిక రక్తపోటు గుండెపోటు ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది? ఎంత బీపీ దాటితే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అధిక రక్తపోటు అంటే ఏంటి?


​అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్త నాళాల ద్వారా ప్రవహించే రక్తం యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు వస్తుందని నిపుణులు అంటున్నారు.


మీ రక్తపోటు 90/60 mmHg కంటే ఎక్కువగా, 120/80 mmHg కంటే తక్కువగా ఉంటే మీరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు. మీ రక్తపోటు 120/80 mmHg, 140/90 mmHg మధ్య ఉంటే, ఈ పరిస్థితిని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. అయితే రక్తపోటు 130/80 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దానిని అధిక రక్తపోటుగా పరిగణిస్తారు.


బీపీ ఎంత దాటితే గుండెపోటు వస్తుంది?


రక్తపోటు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువకు చేరుకుంటే, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె యొక్క పనిభారం పెరుగుతుంది. కొన్నిసార్లు ప్రధాన ధమని పగిలిపోయేలా చేస్తుంది.


అందువల్ల, రక్తపోటు రోగులు తమను తాము క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. రక్తపోటు 160/100 mmHg కంటే ఎక్కువగా ఉంటే గుండె, రక్త నాళాలపై చాలా ఒత్తిడి ఉంటుంది మరియు గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.


ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?


అధిక రక్తపోటుకు నిర్దిష్ట లక్షణాలు లేవని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తరచుగా మూత్ర విసర్జన, తీవ్రమైన తలనొప్పి, కళ్ళు ఎర్రబడటం, ఛాతీ నొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం, ముఖం ఎర్రబడటం, అధిక చెమట, అస్పష్టమైన దృష్టి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తవచ్చు.


అధిక రక్తపోటు గురించి అపోహలు


అధిక రక్తపోటు గురించి చాలా మంది కొన్ని అపోహాలు కలిగి ఉంటారని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు అధిక రక్తపోటు కారణంగా మాత్రమే గుండెపోటు ప్రమాదం ఉంటుందని భావిస్తారు. అయితే, చాలా నెలలు లేదా సంవత్సరాలు రక్తపోటును నియంత్రించకపోతే, ధమనుల లోపలి గోడలు బలహీనపడతాయి.


దీనివల్ల వాటిలో కొలెస్ట్రాల్ సులభంగా పేరుకుపోతుంది, ఫలకం ఏర్పడుతుంది. ఈ ఫలకాల్లో ఒకటి పగిలిపోతే, రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తపోటు చాలా ఎక్కువగా లేకపోయినా గుండెపోటు రావచ్చు.


ఎప్పుడు వైద్య సాయం అవసరం?


రక్తపోటు 180/120 mmHg కంటే ఎక్కువగా ఉంటే.. తక్షణ వైద్య సహాయం అవసరం. ఈ స్థాయిలో గుండె రక్తాన్ని పంప్ చేయడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల ప్లేక్ పగిలిపోవడం, గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో తీవ్రమైన తలనొప్పి, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, అస్పష్టమైన దృష్టి లేదా గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. అంతేకాకుండా అధిక రక్తపోటు ప్రమాదం వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపాన అలవాట్లు లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారికి 150/95 mmHg BP ఉన్నప్పటికీ గుండె సమస్యలు ఉండవచ్చు.


ఎలా నివారించాలి?


​గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి బీపీని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.


ప్రతిరోజూ తగినంత నిద్ర పొందండి. తగినంత నిద్ర రక్తపోటును అదుపులో ఉంచడానికి సాయపడుతుంది.


అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. ఆహారంలో ఉప్పు మొత్తాన్ని పరిమితం చేయండి.


ఊరగాయలు, సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.


ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరల్ని చేర్చుకోండి. ఆహారంలో ప్రోటీన్, తృణధాన్యాల్ని చేర్చుకోండి.


ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. అధిక రక్తపోటును నివారించడానికి చురుకుగా ఉండటం చాలా ముఖ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa