ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అత్యాధునిక సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 'క్వాంటమ్ వ్యాలీ'ని వేదికగా చేసుకొని, నూతన ఔషధాలు, మెటీరియల్ సైన్స్‌పై పరిశోధనలు చేసేందుకు 'గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండ్రీ' ముందుకొచ్చింది. రూ. 200 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలు దేశాలకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కూడిన బృందం సమావేశమై తమ ప్రతిపాదనలను వివరించింది.ఈ సందర్భంగా గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండ్రీ ప్రతినిధులు మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రం దేశంలోనే తొలి క్వాంటమ్ బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా నిలుస్తుందని తెలిపారు. మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటీరియల్ సైన్స్ వంటి క్లిష్టమైన రంగాల్లో తమ పరిశోధనలు సాగుతాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ ప్రభుత్వ విధానాలు, క్వాంటం వ్యాలీ ఏర్పాటు వంటి అంశాలు తమను ఎంతగానో ఆకర్షించాయని వారు పేర్కొన్నారు.ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధునిక పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వైద్యారోగ్యం, ఔషధాల తయారీ వంటి రంగాల్లో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. క్వాంటమ్ పరిశోధనల ద్వారా బయోసెన్సార్ల వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేసి, వాటి ఫలాలను ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గతంలో ఐటీ, జీనోమ్ వ్యాలీ వంటివి ఎలా విజయవంతమయ్యాయో, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా అదే స్థాయిలో నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.త్వరలోనే అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చంద్రబాబు తెలిపారు. జాతీయ క్వాంటమ్ మిషన్‌ను అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతోందని వివరించారు. క్వాంటమ్ బయో ఫౌండ్రీ ఏర్పాటు ఒక వినూత్న ఆలోచన అని అభినందించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా వంటి కీలక రంగాల భాగస్వాములందరూ క్వాంటమ్ వ్యాలీ సేవలను వినియోగించుకునేలా ఒక సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa