మీరు హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు బిల్లులో సర్వీస్ చార్జ్ కనిపిస్తోందా? అది కట్టడం తప్పనిసరి అని యాజమాన్యం మిమ్మల్ని ఒత్తిడి చేస్తోందా? అయితే ఈ వార్త మీకోసమే. కస్టమర్ల అనుమతి లేకుండా, బలవంతంగా సర్వీస్ చార్జ్ వసూలు చేయడం చట్టవిరుద్ధమని కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) మరోసారి స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ముంబైలోని ప్రముఖ 'బోరా బోరా' రెస్టారెంట్ చైన్ నిర్వాహకులకు రూ. 50,000 భారీ జరిమానా విధించింది.
అసలేం జరిగిందంటే..?
ముంబైకి చెందిన ఒక వినియోగదారుడు డిసెంబర్ 29వ తేదీన జుహులోని 'బోరా బోరా' రెస్టారెంట్‌కు వెళ్లారు. తనకు నచ్చినవన్నీ ఆర్డర్ పెట్టుకుని ఎంచక్కా తినేశారు. ఇదంతా బాగానే ఉండగా.. అక్కడి సిబ్బంది బిల్లు తీసుకు వచ్చారు. దాన్ని ఓసారి సరిగ్గా గమనించిన వినియోగదారుడు.. బిల్లులో అదనంగా 10 శాతం సర్వీస్ చార్జ్ కలపడాన్ని గుర్తించారు. గీంతో సదరు కస్టమర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ చార్జీని తొలగించాలని కోరారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది అందుకు నిరాకరించడమే కాకుండా కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. దీంతో బాధితుడు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (1098) ద్వారా ఫిర్యాదు చేశారు.
విచారణలో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు
ఈ ఫిర్యాదుపై CCPA డైరెక్టర్ జనరల్ లోతైన విచారణ జరిపారు. ఈ విచారణలో విస్మయం కలిగించే అంశాలు బయటపడ్డాయి. రెస్టారెంట్ తన బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో సర్వీస్ చార్జీని 'డిఫాల్ట్' (Default) గా సెట్ చేసింది. అంటే ప్రతి కస్టమర్‌కు తెలియకుండానే ఆ చార్జ్ బిల్లులో యాడ్ అయిపోతుంది. 2025 మార్చి 28న ఢిల్లీ హైకోర్టు "సర్వీస్ చార్జ్ వసూలు చేయడం అక్రమం" అని స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఈ రెస్టారెంట్ ఏప్రిల్ 30 వరకు అందరి దగ్గరా వసూలు చేస్తూనే ఉంది. సర్వీస్ చార్జ్ అనేది హోటల్ ఇచ్చే అదనపు సదుపాయం. కానీ ఈ రెస్టారెంట్ ఆ సర్వీస్ చార్జ్ మొత్తంపై కూడా మళ్లీ జీఎస్టీ వసూలు చేసి వినియోగదారులను నిలువునా ముంచింది.
కస్టమర్ ఫిర్యాదు చేసినా, అధికారులు నోటీసులు పంపినా రెస్టారెంట్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా వారి అధికారిక ఈమెయిల్ ఐడి కూడా పని చేయడం లేదు. అయితే ఈ ఘటనపై స్పందించిన CCPA చీఫ్ కమిషనర్ నిధి ఖారే.. ఇది అన్యాయమైన వ్యాపార విధానం అని అన్నారు. అలాగే రూ. 50,000 జరిమానాతో పాటు మరికొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ నుంచి ఆటోమేటిక్ సర్వీస్ చార్జ్ ఆప్షన్‌ను తొలగించాలని పేర్కొన్నారు. వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థలను (ఈ మెయిల్, ఫోన్) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని గట్టిగా చెప్పారు. ఈ ఆదేశాలను అమలు చేసినట్లు 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కూడా పేర్కొన్నారు.
వినియోగదారులు గుర్తుంచుకోవాల్సినవి..
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. సర్వీస్ చార్జ్ అనేది పూర్తిగా స్వచ్ఛందం. మీకు హోటల్ సర్వీస్ నచ్చితేనే 'టిప్' రూపంలో డబ్బులు ఇవ్వవచ్చు. బిల్లులో దాన్ని తప్పనిసరిగా కలిపే అధికారం ఏ హోటల్‌కూ లేదు. ఒకవేళ ఏ రెస్టారెంట్ అయినా మిమ్మల్ని బలవంతం చేస్తే.. మీరు కూడా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ లేదా 'ఈ-దాఖల్' (E-Daakhil) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa