ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్ మూక దాడిలో గాయపడిన హిందూ వ్యక్తి ఖకోన్ దాస్ మృతి

international |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 09:25 PM

బంగ్లాదేశ్‌లో ఇటీవల మూక దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హిందూ వ్యక్తి 50 ఏళ్ల ఖోకాన్ దాస్ శనివారం మృతిచెందాడు. ఢాకా ఆసుపత్రిలో మృత్యువుతూ పోరాడుతూ దాస్ కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. డిసెంబర్ 31న షరియత్ పూర్ జిల్లాలో ఉన్మాద మూక ఖోకాన్ దాస్‌‌పై దాడిచేసి, సజీవదహనానికి యత్నించిన సంగతి తెలిసిందే. తన గ్రామంలో మందులు, మొబైల్ బ్యాకింగ్ వ్యాపారం చేసుకుంటోన్న దాస్‌.. బుధవారం దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఉన్మాదులు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అనంతరం అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా.. ప్రాణాలను కాపాడుకోడానికి పక్కనే ఉన్న చెరువులో దూకారు. స్థానికులు రాకతో నిందితులు అక్కడ నుంచి పరిపోయారు. తీవ్రంగా గాయపడిన దాస్‌ను కుటుంబసభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఢాకాకు తరలించారు.


ఖోకాన్ దాస్ భార్య సీమా దాస్ మాట్లాడుతూ.. నా భర్తపై ఇంత కిరాతకంగా ఎందుకు దాడిచేశారో అర్ధం కావడం లేదని, మా కుటుంబానికి ఈ ప్రాంతంలో శత్రువులు ఎవరూ లేరని అన్నారు. ‘మాకు ఎవరితోనూ ఎలాంటి వివాదాలు లేవు.. సడెన్‌గా నా భర్త వారికి ఎందుకు టార్గెట్ అయ్యారో’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, తన భర్తపై దాడిచేసినవారు ముస్లింలు అని, మా కుటుంబానికి ప్రభుత్వం, పోలీసులు సహాయం చేయాలని సీమా కోరారు. తన భర్తకు నిప్పంటించివారిలో ఇద్దర్ని తాను గుర్తించానని ఆమె అన్నారు.


బంగ్లాదేశ్‌లో రెండు వారాల వ్యవధిలోనే హత్యకు గురైన నాలుగో హిందువు ఖోకాన్ దాస్. విద్యార్థి నేత షరీఫ్ హాడీ హత్య అనంతరం బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో హిందువులపై మూక దాడులు జరుగుతున్నాయి. డిసెంబర్ 18న మైమన్‌సింగ్‌ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే హిందువును దైవదూషణ ఆరోపణలతో కొట్టిచంపిన నిందితులు.. శవాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత వారానికి డిసెంబరు 24న అమృత్‌ మండల్‌ అలియాస్ సామ్రాట్, దీనికి ముందు ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డు బజేంద్ర బిశ్వాస్ ప్రాణాలు కోల్పోయారు.


మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందువులు సహా మైనార్టీలపై హింస తీవ్రంగా పెరుగుతోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పలు సామాజిక, మానవహక్కులు సంఘాలు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. మైనారిటీలకు రక్షణ కల్పిస్తున్నామని బంగ్లాదేశ్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి నివేదికలు మాత్రం ఇందుకు భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. మైనారిటీలపై దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉండటం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ ఘటనలపై పలు సందర్భాల్లో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు దేశంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa