కొత్త సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) మరో కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల కరెన్సీ నోట్ల వివరాల్ని వెల్లడించింది. ఇప్పటివరకు చలామణీలో ఉన్న దాంట్లో ఏకంగా 98.41 శాతం వరకు రూ. 2 వేల విలువైన నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. మొత్తం ఈ కరెన్సీ నోట్ల విలువ 2023, మే 19న రూ. 3.56 లక్షల కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అది రూ. 5,669 కోట్లకు చేరుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఇంకా చలామణీలో రూ. 5,669 కోట్ల వరకు విలువైన 2 వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2025, డిసెంబర్ 31 వరకు ఉన్న డేటాకు సంబంధించి.. ఈ వివరాల్ని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో విడుదల చేసింది.
2023, మే 19న ఆర్బీఐ 2 వేల నోట్లపై సంచలన ప్రకటన చేసింది. ఈ పెద్ద నోట్లను చలామణీ నుంచి వెనక్కి తీసుకుంటున్నామని (ఉపసంహరణ) పేర్కొంది. అప్పట్లో జనం తమ దగ్గరున్న ఈ నోట్లను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ బ్రాంచుల ద్వారా డిపాజిట్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ అవకాశం 2023, అక్టోబర్ 7 వరకు కొనసాగింది. ఇక అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సదుపాయం తీసుకొచ్చింది. అక్కడ డిపాజిట్ చేసి బ్యాంక్ అకౌంట్లలోకి క్రెడిట్ చేయడం ప్రారంభించింది.
ఇప్పుడు జనం తమ దగ్గర ఉన్నటువంటి రూ. 2 వేల విలువైన కరెన్సీ నోట్లను దేశంలోని ఎక్కడి పోస్టాఫీస్ నుంచి అయినా ఇండియా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపించే వెసులుబాటు తీసుకొచ్చింది. అయితే ఆర్బీఐ గతంలో ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది కానీ ఇప్పటికీ వీటిని రద్దు చేయలేదు. అంటే చట్టపరంగా ఇవి ఇంకా చెల్లుబాటులోనే ఉన్నాయని చెప్పొచ్చు. తాజాగా మరోసారి జనవరి 1న ఆర్బీఐ దీనిపై కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల విలువైన కరెన్సీ నోట్లు ఇప్పటికీ లీగర్ టెండర్‌గానే (చట్టబద్ధ కరెన్సీ) కొనసాగుతాయని స్పష్టం చేసింది.
>> ఇక అంతకుముందు చూసుకుంటే 2016 నవంబర్ 8న.. నల్లధనాన్ని అరికట్టేందుకు అప్పటి పెద్ద నోట్లుగా చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1000 విలువైన కరెన్సీ నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో ఆ తర్వాత కొంత కాలానికి కొత్త రూ. 500, రూ. 2 వేల నోట్లను ముద్రించి విడుదల చేసింది. అప్పట్లో నోట్ల రద్దుతో.. తీవ్రమైన నగదు కొరత కూడా ఏర్పడింది. జనం పాత నోట్లను మార్చుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత 2023, మే 19న రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. ఇప్పుడు రూ. 500 నోటే భారతదేశంలో పెద్ద నోటుగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa