ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెనిజులాలో విస్తారమైన ఖనిజ సంపద,,,అత్యద్భుత జీవ వైవిధ్యం

international |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 08:16 PM

దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తరం దిశలో.. కొలంబియా, బ్రెజిల్, గయానా దేశాల మధ్యలో వెనిజులా ఉంటుంది. దీన్ని అఫీషియల్‌గా బొలివియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా అని పిలుస్తారు. కరేబియన్ దీవులైన ట్రినిడాడ్ టొబాగో, గ్రెనడా, బార్బడోస్ మొదలైనవి కూడా వెనిజులాకు దగ్గరగానే ఉంటాయి. 9.16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న వెనిజులాలో 3.1 కోట్ల మంది నివసిస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఎక్కువగా పట్టణీకరణ చెందిన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దక్షిణ అమెరికన్లకు అత్యంత ఇష్టమైన ఫుట్ బాల్, అయితే వెనిజులా ప్రజలు ఎక్కువగా ఇష్టపడేది మాత్రం బేస్ బాల్.


వెనిజులాను అందగత్తెల దేశం అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యధిక అందాల పోటీల్లో కిరీటాలు గెలిచిన దేశాల్లో వెనిజులా తొలిస్థానంలో ఉంటుంది. ఈ దేశ మహిళలు అత్యధికంగా ఏడుసార్లు మిస్ యూనివర్స్ టైటిల్ గెలవగా.. 9సార్లు మిస్ ఇంటర్నేషనల్, రెండుసార్లు మిస్ ఎర్త్ టైటిల్ గెలిచారు. వెనిజులా అమ్మాయిలు.. భారత్‌తో సమానంగా ఆరుసార్లు మిస్ వరల్డ్ టైటిల్‌ను సైతం సొంతం చేసుకున్నారు. వెనిజులాలో అందాన్ని వినోదంగా కాకుండా జాతీయ క్రీడగా భావిస్తారు. మిస్ వెనిజులా పోటీలను ఆ దేశ ప్రజలు అత్యంత ఆసక్తితో చూస్తారు. 1981లో మిస్ యూనివర్స్ గెలిచిన ఐరీన్ సేజ్ వెనిజులా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడ్డారు.


వెనిజులా రాజధాని కారకస్. ఆ దేశంలో ఇదే అతిపెద్ద నగరం. ఇక రెండో పెద్ద నగరం మరకైబో. ఈ నగరానికి దగ్గర్లోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. మూడో పెద్ద నగరం వలెన్సియా. ఇది పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. జీవ వైవిధ్యానికి ఈ దేశం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.


ప్రపంచంలోనే ఎత్తైన జలపాతమైన ఏంజెల్ ఫాల్స్ (979 మీటర్లు) వెనిజులాలోని కనైమా నేషనల్ పార్కులో ఉంది. ఇక్కడి మరకైబో సరస్సుపైన.. ఏడాదిలో దాదాపు 260 రోజులపాటు రాత్రి వేళల్లో నిత్యం మెరుపులు మెరుస్తుంటాయి. దీన్ని మరకైబో లైట్ హౌస్ కూడా అని పిలుస్తారు. స్థానిక తెగలు దేవతల నివాసంగా భావించే టెపుయిస్ పర్వతాలు వెనిజులాలో మరో ఆకర్షణ. అత్యంత పురాతన శిలలతో ఏర్పడిన ఈ పర్వతాల శిఖరాలు బల్లపరుపుగా ఉండటం విశేషం.


వెనిజులా అతిపెద్ద బలం విస్తారమైన సహజవనరులు. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆ దేశంలో ఉన్న ఖనిజ సంపద జాబితా పెద్దదే. విస్తీర్ణం పరంగా ప్రపంచంలో 32వ స్థానంలో ఉన్న వెనిజులా.. అత్యధిక సహజ వనరులు ఉన్న తొలి పది దేశాల్లో ఒకటి కావడం గమనార్హం. ఆండీస్ పర్వతాలు, అమెజాన్ అడవులు, విశాలమైన పచ్చిక బయళ్లు, పొడవైన తీరప్రాంతం ఈ దేశానికి ఆకర్షణలు. వెనిజులా భూభాగంలో దాదాపు 15.5% శాతం విస్తీర్ణంలో రక్షిత అడవులు, నేషనల్ పార్కులు ఉన్నాయి.


ప్రపంచంలోకెల్లా అత్యధిక చమురు నిక్షేపాలు ఉన్న దేశంగా వెనిజులా గుర్తింపు పొందింది. ఈ దేశంలో 300 బిలియన్ బ్యారెళ్లకుపైగా చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ మంచి నీటి కంటే చౌకగా లభించేది. అంతే కాకుండా 195-221 లక్షల కోట్ల ఘనపుటడుగుల సహజవాయు నిక్షేపాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. లాటిన్ అమెరికాలోని 80 శాతం గ్యాస్ నిక్షేపాలు ఉన్న వెనిజులా.. ఈ విషయంలో ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉంది.


అంతే కాదు వెనిజులాలో 4.1 బిలియన్ టన్నుల ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నాయి. తమ దేశంలో 8 వేల టన్నుల బంగారం నిల్వలు కూడా ఉన్నాయని వెనిజులా ప్రకటించింది. అయితే దీన్ని నిర్ధారించాల్సి ఉంది. ఈ లాటిన్ అమెరికా దేశంలో దాదాపు 800 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఒరినోకే నది, కరోనీ రివర్ బేసిన్ వల్ల ప్రపంచంలోని దాదాపు 2 శాతం మంచి నీటి వనరులు వెనిజులాలో ఉన్నాయి. ఇవే కాకుండా.. నికెల్, రాగి, ఫాస్ఫేట్స్ లాంటి ఖనిజాలతోపాటు.. ఎలక్ట్రిక్ బ్యాటరీల్లో వాడుతున్న కోల్టాన్, థోరియం లాంటి ఖనిజాలు కూడా వెనిజులాలో ఉన్నాయని భావిస్తున్నారు.


వెనిజులా 1522లో స్పెయిన్‌కు వలస కాలనీగా వెనిజులా ఉండేది. ఆ తర్వాత 1811లో స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం సాధించిన ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాలో భాగంగా ఉండేది. 1830లో ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. 19వ శతాబ్దంలో వెనిజులా రాజకీయ అస్థిరతను, నిరంకుశత్వాన్ని ఎదుర్కొంది. 20 శతాబ్దం సగం వరకు.. సైనిక నియంతలు ఆధిపత్యం చలాయించారు. అల్లర్లు, తిరుగుబాటు ప్రయత్నాల వల్ల ఈ దేశం చాలా కాలంపాటు ఇబ్బందులు ఎదుర్కొంది. చమురు నిక్షేపాల కారణంగా.. సంపద వచ్చి పడటంతో ప్రజాకర్షక పథకాలకు నిధులు అందాయి. అయితే 2010 తర్వాత పేదరికం వేగంగా పెరిగింది.


అపారమైన సహజ సంపద ఉన్నప్పటికీ.. సంస్కృతి గొప్పదే అయినప్పటికీ.. రాజకీయ అనిశ్చితుల వల్ల వెనిజులా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటడంతో.. కిలో చికెన్ కొనడానికి సంచుల కొద్దీ కరెన్సీ నోట్లను తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో లక్షలాది మంది వెనిజులా ప్రజలు బతుకుదెరువు కోసం విదేశాల బాట పట్టారు. అమెరికా జోక్యం తర్వాతైనా ఆ దేశ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుందా..? లేదా మరింత అధ్వాన్నంగా మారుతుందా అనేది చూడాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa