ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడిగా మదురో.. మూడుసార్లు గెలిచి 12 ఏళ్లుగా అధికారం

international |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 08:18 PM

వెనిజులా రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.బస్సు డ్రైవర్ స్థాయి నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగిన నికోలస్ మదురో పతనం తీవ్ర దిగ్భ్రాంతికర రీతిలోజరిగింది. అమెరికా దళాలు.. వెనిజులా రాజధాని కరాకస్‌పై శనివారం జరిపిన మెరుపు దాడిలో నికోలస్ మదురో చిక్కడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగాధృవీకరించారు. నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌పై కూడా న్యూయార్క్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు అమెరికా అటార్నీ జనరల్ ప్రకటించారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెనిజులాపై పెంచిన ఒత్తిడి చివరకు మదురో పతనానికి దారితీసింది.


చావెజ్ వారసుడిగా ప్రస్థానం


ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉన్న నికోలస్‌ మదురో.. రాజకీయ ప్రస్థానం 40 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. గత 12 ఏళ్లుగా వెనెజులా అధ్యక్షుడిగా ఉన్నారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన మదురో.. 1990ల్లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి క్రమంగా ఎదిగారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో 1962లో జన్మించిన మదురో తండ్రి ఒక కార్మిక నాయకుడు. మొదట 1990ల్లో నికోలస్ మదురో.. బస్‌ డ్రైవర్‌గా పనిచేశారు.


అప్పుడే వామపక్ష రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని హ్యూగో చావెజ్‌కు దగ్గరయ్యారు. 1999లో వెనిజులా అధ్యక్షుడిగా చావెజ్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత మదురో దశ పూర్తిగా మారిపోయింది. హ్యూగో చావెజ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారిన నికోలస్ మదురో.. ఆయన మరణానంతరం 2013లో వెనిజులా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అయితే చావెజ్‌కు ఉన్న ప్రజాదరణ మదురోకు మాత్రం ఎప్పుడూ లభించలేదు. ఇక 2013లో జరిగిన వెనిజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో దక్కించుకున్న నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


ఆర్థిక పతనం, అణచివేత


నికోలస్ మదురో పాలనలో వెనిజులా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. 2012-2020 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా 71 శాతం పడిపోవడం ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేసింది. ద్రవ్యోల్బణం ఏకంగా 1.30 లక్షల శాతానికి పెరిగి పోవడంతో వెనిజులా ప్రజలు ఆహారం, మందుల కోసం అల్లాడిపోయారు. ఆకలి తట్టుకోలేక సుమారు 77 లక్షల మంది వెనిజులా వాసులు తమ సొంత దేశాన్ని వదిలేసి ఇతర దేశాలకు వలస వెళ్లారు. తనను వ్యతిరేకించిన వారిని జైల్లో వేయడం.. చిత్రహింసలకు గురిచేయడం వంటి చర్యల వల్ల నికోలస్ మదురోపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) దర్యాప్తు కూడా చేపట్టింది.


ముగిసిన మదురో శకం


2024 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నికోలస్ మదురోకు.. అమెరికాలో తిరిగి డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టడం శాపంగా మారింది. అమెరికా ఆంక్షలు, సైనిక ఒత్తిడికి తలవంచని నికోలస్ మదురో.. చివరికి అమెరికా దళాల చేతికి చిక్కారు. దీంతో వెనిజులాలో చావెజ్ ప్రారంభించిన సోషలిస్ట్ విప్లవం ఒక విషాదకర ముగింపునకు చేరుకుంది.


నికోలస్ మదురో ప్రస్థానం


కరాకస్ సబ్‌వే సిస్టమ్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే యూనియన్ నాయకుడిగా ఎదిగారు. 1986లో క్యూబాలో నికోలస్ మదురో రాజకీయ శిక్షణ పొందారు. వెనిజులా విదేశాంగ మంత్రిగా.. వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసి.. చివరికి చావెజ్ చనిపోయిన తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యారు. 2018, 2024 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారాన్ని చేజిక్కించుకున్నారని వెనిజులాలోని ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు ఆరోపించాయి.


మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2014, 2017లో వెనిజులా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. భారీగా ప్రజలు రోడ్లపైకి రావడంతో వారిని మదురో అణచివేశారు. వేలాది మందిని నిర్బంధించారు. గతేడాది జనవరిలో వెనిజులా మూడోసారి అధ్యక్షుడిగా మదురో పగ్గాలు అందుకున్నారు. ఆ ఎన్నికలపైనా తీవ్ర వివాదం చెలరేగగా.. మదురోను వెనిజులా అధ్యక్షుడిగా గుర్తించేందుకు అమెరికా అంగీకరించలేదు. దీనికి తోడు వెనిజులా విపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్‌నే తాము అధ్యక్షుడిగా గుర్తిస్తామని తేల్చి చెప్పింది.


సత్య సాయిబాబా భక్తుడిగా మదురో


ఇక నికోలస్ మదురో పుట్టపర్తి సత్య సాయిబాబాను బాగా విశ్వసిస్తారు. అందుకే ఆయన ఆఫీస్‌లో భారీ సాయిబాబా ఫోటోను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వెనిజులా విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు 2005లో భారత పర్యటనకు వచ్చిన మదురో.. పుట్టపర్తికి చేరుకుని అక్కడ సాయిబాబాతో భేటీ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa