ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుడ్ని కూడా వదల్లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 08:45 PM

కేరళలోని శబరిమల శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలోని బంగారం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. ఈ కేసులో కేరళ హైకోర్టు తనను బాధ్యులుగా చేస్తూ.. చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ శంకర్‌దాస్ చేసిన విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చింది. శంకర్‌దాస్ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మల ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సమావేశపు మినిట్స్‌పై సంతకం చేశారని, ఈ చోరీ కేసులో బాధ్యత నుంచి తప్పించుకోలేరని ధర్మాసనం పేర్కొంది. దేవుడు అంటే మీకు లెక్కలేదు, ఆయన్ని కూడా వదిలిపెట్టలేదని వ్యాఖ్యానించింది.


 టీడీబీ సభ్యులైన కేపీ శంకర్‌దాస్, విజయ్‌కుమార్‌లు బంగారం చోరీ కేసులో బాధ్యులేనని పేర్కొన్న కేరళ హైకోర్టు తీర్పులోని ఐదు పేరాలను తొలగించడానికి న్యాయమూర్తులు నిరాకరించారు. ఈ దశలో హైకోర్టు పరిశీలనలలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ తన ఉత్తర్వుల్లో దేవస్థానం బోర్డు సభ్యులు శంకర్ దాస్, విజయ్‌కుమార్‌లు ఈ కేసులో బాధ్యులేనని స్పష్టం చేశారు.


అయితే, తన వాదనను వినకుండానే తనకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని, ఇది నిష్పక్షపాత విచారణకు ఆటంకం కలిగించవచ్చని శంకర్‌దాస్ వాదించారు. తన వయస్సు, ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన ఉపశమనం కలిగించాలని సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే చట్టానికి అనుగుణంగా యోగ్యతను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టత నిచ్చింది. అంతేకాదు, హైకోర్టు సింగిల్ జడ్జ్ తన పట్ల చేసిన వ్యాఖ్యలను తొలగించాలని భావిస్తే డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని సూచించింది.


శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో బంగారు తాపడంలో అవకవతవకలు జరిగాయనే ఆరోపణలతో వివాదం చెలరేగింది. స్వామివారి ఆలయంలో సువర్ణ తాపడం కోసం పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా 1998లో 30.3 కిలోల బంగారం, 1900 కిలోల రాగిని విరాళంగా ఇచ్చారు. అయితే, పనులు పూర్తయిన తర్వాత ఆలయంలో వివిధ భాగాల నుంచి బంగారాన్ని విడత విడతలుగా క్రమపద్ధతిలో తొలగించారని, ఇది సుదీర్ఘమైన వ్యవస్థీకృత ఆపరేషన్‌ను సూచిస్తుందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా గుర్తించింది. దొంగిలించిన బంగారాన్ని వేరు చేయడం, ప్రాసెసింగ్ కోసం రహస్యంగా చెన్నైకి తరలించినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు.


బంగారం మాయం అంశంపై రెండో నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించిన సిట్.. టీడీబీ సమావేశపు మిన్సిట్‌లో తీవ్రమైన అవకతవకలు గుర్తించినట్టు అందులో పేర్కొంది. ఈ కేసులో టీడీబీ ప్రెసిడెంట్, కమిషనర్, సభ్యులుగా సీపీఎం నేతలు సహా ఇప్పటి వరకూ 10 మందిని సిట్ అరెస్ట్ చేసింది. అక్టోబరు 17న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని అదుపులోకి తీసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa