తమిళనాడులో రోజురోజుకూ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. ఆ రాష్ట్రంలో పార్టీలు తమదైన అస్త్రశస్త్రాలతో సన్నద్ధం అవుతున్నాయి. తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బీజేపీ.. ఈసారి ఎలాగైనా తమ సత్తా చాటాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటికే తమిళనాడుపై ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో మిత్ర పక్షాలు, కొత్త పొత్తులపై దృష్టి సారించారు. తమిళనాడులో బలపడాలని చూస్తున్న కాషాయ పార్టీ.. ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తన తాజా తమిళనాడు పర్యటనలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పోటీ చేయడం మాత్రమే కాకుండా.. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కమలం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు.. పాత మిత్రపక్షం ఏఐఏడీఎంకేకు చెక్ పెడుతూ.. కొత్త శక్తులతో కూటమి కట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తమిళనాడు రాజకీయాల్లో ఎదుగుతుండటంతో.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని.. డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్ర పక్షాలకు పంపించారు.
సంక్రాంతికే క్లారిటీ
జనవరి 14వ తేదీన వచ్చే పొంగల్ (సంక్రాంతి) నాటికే మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలని అమిత్ షా.. తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని సూచించారు. అయితే ఇప్పటికే తాము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీవీకే పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే.. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉండటంతో.. ఆ గ్యాప్‌ను ఉపయోగించుకుని విజయ్‌ను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసి.. అధికార వైసీపీని గద్దె దించి.. ఏకంగా 164 సీట్లతో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర చాలానే ఉంది. అటు బీజేపీని, టీడీపీని సమన్వయం చేసుకుంటూ.. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించి.. ఎన్నికల ప్రచారం చేసి.. చివరికి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ సహాయంతో బీజేపీ అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.
బీజేపీ పాచిక పారేనా?
అయితే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి బీజేపీ వేసిన ఎత్తుగడలు సక్సెస్ అయ్యాయి. కానీ అటు డీఎంకేను.. ఇటు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విజయ్.. తన పార్టీ ఐడియాలజీ ప్రకారం.. కమలం పార్టీతో కలిసే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాచికలను తమిళనాడులో విజయ్ పారనిస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా మారతాయో మనం వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa