దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి నాయకులు షర్జీల్ ఇమామ్ , ఉమర్ ఖలీద్‌లకు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు .. ఇమామ్, ఖలీద్‌లకు మినహా మిగతా ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ విషయంలో అందర్నీ ఒకే విధంగా చూడలేమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నా గుల్ఫీషా ఫాతిమా, మీరన్ హైదర్, షైఫా ఉర్ రెహ్మాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు షరతులతో కూడిన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
‘‘అపరాధం విషయంలో అందరూ అప్పీలుదారులు సమాన స్థాయిలో లేరని రికార్డు వెల్లడిస్తుంది.. పాల్గొనే విధానం ప్రకారం కోర్టు ప్రతి దరఖాస్తును వ్యక్తిగతంగా అంచనా వేయాలి. ఆర్టికల్ 21 రాష్ట్రం సుదీర్ఘ విచారణకు ముందు కస్టడీని సమర్థించుకోవాలని కోరుతుంది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణలో జరిగిన జాప్యం ప్రయోజనాన్ని ఆ ఇద్దరికీ కల్పించలేమని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. 2020 ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్న కుట్రకు సంబంధించిన ఆరోపణలపై ఉపా చట్టం (యూఏపీఏ) కింద దాఖలైన కేసులో తమకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
2020 ఢిల్లీ అల్లర్ల కేసు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ చట్టం, నేషనల్ పౌర రిజిస్టర్ లకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో 2020 ఫిబ్రవరి 4న చేపట్టిన ఆందోళనలు సందర్భంగా మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో కనీసం 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 700 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ముస్లింలే. ఈ ఘటనల్లో ఉమర్ ఖలీద్ , షర్జీల్ ఇమామ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేస్ సహా 20 మందిని కుట్రదారులుగా పేర్కొంటూ కేసు నమోదయ్యింది.
ఈ కేసులో బెయిల్ కోసం ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ వేసిన ధరఖాస్తును ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్దేశపూర్వకంగానే నేరానికి పాల్పడి, ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్రలు చేశారని, ఇవి యాదృచ్ఛికంగా జరిగిన అల్లర్లు కావని వాదించారు. ‘పాలన మార్పు’, ‘ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం’ లక్ష్యంగా ఒక పక్కా ప్రణాళికతో దేశవ్యాప్త కుట్రకు తెరతీశారని పోలీసులు తెలిపారు. అయితే, తనపై ఢిల్లీ పోలీసులు పెట్టిన ‘కుట్ర’ అభియోగాలను గత సెప్టెంబరులో ఖలీద్ వ్యతిరేకించారు. ఈ ‘హాస్యాస్పదమైన ఎఫ్‌ఐఆర్’ విషయంలో తాను ఐదేళ్లుగా కస్టడీలో గడిపానని ఢిల్లీ కోర్టుకు తెలిపారు. తనను ఇరికించడానికి అబద్దపు సాక్ష్యాలను సృష్టించారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa