హిమాలయ దేశం నేపాల్లో మతపరమైన ఘర్షణలు చెలరేగడంతో భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధనుషా జిల్లాలో మొదలైన వివాదం క్రమంగా హింసాత్మకంగా మారడంతో.. భారత్ వెంటనే అప్రమత్తం అయింది. శాంతిభద్రతల దృష్ట్యా బీహార్లోని రక్సాల్ను ఆనుకుని ఉన్న సరిహద్దులను భారత భద్రతా దళాలు పూర్తిగా మూసివేసి, హై అలర్ట్ ప్రకటించాయి.
వివాదానికి కారణం ఏంటి?
ఈ ఘర్షణలకు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోనే ప్రధాన కారణమని తెలుస్తోంది. ధనుషా జిల్లా కమల మున్సిపాలిటీకి చెందిన హైడర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని వర్గాలను కించపరిచేలా వీడియో పోస్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆగ్రహించిన స్థానికులు వారిని పోలీసులకు అప్పగించినప్పటికీ.. పరిస్థితి సద్దుమణగలేదు. దీనికి నిరసనగా సఖువా మరన్ ప్రాంతంలోని ఒక మసీదుపై దాడి జరగడంతో వివాదం మరింత ముదిరింది. హిందూ సంస్థలు సైతం తమ దేవతలను కించపరిచారంటూ ఆందోళనలకు దిగడంతో పర్సా, రాహుల్ వంటి సరిహద్దు ప్రాంతాలు రణరంగంగా మారాయి.
బిర్గంజ్ పట్టణంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాకుండా పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఉద్రిక్తతలు పెరగడంతో పర్సా జిల్లా యంత్రాంగం బిర్గంజ్ నగరంలో కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు దాటి అల్లర్లు భారత్లోకి వ్యాపించకుండా ఉండేందుకు 'సశస్త్ర సీమా బల్' మైత్రీ వంతెనను, ఇతర కీలక మార్గాలను సీల్ చేసింది. భారత భద్రతా దళాలు సరిహద్దు వెంబడి గస్తీని ముమ్మరం చేశాయి. సాధారణ పౌరుల రాకపోకలపై పూర్తి నిషేధం విధించగా.. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. మైత్రీ వంతెన వద్ద డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సహదేవ, పంటోకా, సివాన్ తోలా వంటి సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
ఇళ్లకు పయనమైన భారత కార్మికులు
నేపాల్లో నెలకొన్న అస్థిరతతో అక్కడ పని చేస్తున్న భారతీయ వలస కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. బిర్గంజ్లో దుకాణాలు, మార్కెట్లు పూర్తిగా మూతపడటంతో పనుల్లేక వారు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. "అక్కడ పరిస్థితులు అస్సలు బాలేవు. అంతా మూసివేశారు. పరిస్థితి చక్కబడ్డాక మళ్లీ వెళ్తాము" అని ఇంటికి చేరుకుంటున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సరిహద్దు వద్ద పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. నేపాల్లో మంటలు చల్లారే వరకు భద్రతా దళాలు క్షేత్రస్థాయిలో పహారా కొనసాగించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa