అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన గ్లోబల్ టారిఫ్ విధానంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విధిస్తున్న టారిఫ్‌లను వ్యతిరేకించడం అంటే.. అది చైనా అనుకూల వైఖరి అని ఆయన అభివర్ణించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తన తుది నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది. 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విదేశీ వస్తువులపై భారీగా సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ట్రంప్ తన పరిధిని మించి ఈ టారిఫ్స్ విధించారని ఫిర్యాదుదారులు వాదిస్తున్నారు.
తన టారిఫ్ విధానాన్ని సమర్థిస్తూ ట్రంప్ పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సుంకాల వల్ల అమెరికా బడ్జెట్ లోటు స్వల్ప కాలంలోనే 27 శాతం తగ్గిందని ఆయన చెప్పారు. సుంకాల భారం అమెరికా వినియోగదారులపై పడుతుందన్న వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. ఈ డబ్బును విదేశీ కంపెనీలు, మధ్యవర్తులే చెల్లిస్తున్నారని.. దీనివల్ల అమెరికా ఖజానాకు వందల బిలియన్ల డాలర్లు వస్తున్నాయని వాదించారు. సుంకాలను వ్యతిరేకించడం అంటే పరోక్షంగా చైనా ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడమేనని ట్రంప్ మండిపడ్డారు.
ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారనే ప్రశ్నపై ట్రంప్ స్పందించారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. గతంలో స్టీల్, అల్యూమినియం సుంకాల కోసం దీన్ని ఉపయోగించారు. ఒకవేళ టారిఫ్స్ చట్టవిరుద్ధమని కోర్టు చెబితే.. ఇప్పటివరకు వసూలు చేసిన వందల బిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని.. ఇది ఆర్థిక వ్యవస్థలో పెద్ద గందరగోళానికి దారితీస్తుందని హెచ్చరించారు.
ఇక పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల అతి తక్కువ సమయంలోనే అమెరికా ఫెడరల్ బడ్జెట్ లోటు సుమారు 27 శాతం వరకు తగ్గినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ టారిఫ్‌ల పెంపుతో అమెరికాలో జనాల ఖర్చులు పెరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అది నిజం కాదని.. ఆ టారిఫ్‌లను ఆయా దేశాలే చెల్లిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. టారిఫ్‌ల పెంపు వల్ల అమెరికా వినియోగదారులపై ఎలాంటి భారం పడటం లేదని వెల్లడించారు. టారిఫ్‌ల విషయంలో తాను తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైందేనని సమర్థించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa