ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాట్‌ని పెంచని ఫుడ్స్, కడుపు నిండా తిన్నా సన్నగానే ఉంటారు

Life style |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 10:47 PM

ఆహారం తినకుండా బరువు తగ్గడం సరైంది కాదు. సగం కడుపు మాడ్చుకుని తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే, అలాంటి డైట్‌పై ఓసారి కాకపోయినా మరోసారి విరక్తి వచ్చేసి ఆ డైట్‌నే మార్చేస్తారు. మళ్ళీ మొదటికొస్తారు. అందుకే, మంచి డైట్‌ని ముందుగా సెలక్ట్ చేసుకోవాలి. ఆ డైట్ ప్రకారమే తింటే కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఫ్యాట్ లాస్ అవుతారు. వెయిట్‌లాస్ కూడా అవుతారు. దీని గురించి హోమియోపతి డాక్టర్ చందన సజెస్ట్ చేసే కొన్ని ఫుడ్స్ గురించి తెలుసుకోండి.


కోడిగుడ్లు, పాప్‌కార్న్‌తో కడుపు నిండడం


​కోడిగుడ్లు అందరికీ అందుబాటులో ఉండే బెస్ట్ ప్రోటీన్ సోర్స్. రోజూ వీటిని డైట్‌లో యాడ్ చేయడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫ్యాట్, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఉడకబెట్టుకుని తింటే వెయిట్‌మేనేజ్‌మెంట్‌లో చక్కగా హెల్ప్ చేస్తాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్.


అలానే పాప్‌కార్న్. ఇది కూడా మంచి ఫైబర్ ఫుడ్. వీటిని చాలా మంది టైంపాస్‌కి తింటుంటారు. కానీ, అలా కాకుండా, చక్కగా వీటిని కడుపుని నింపే ఫుడ్స్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఫుడ్ కూడా కాదు. కాబట్టి, చక్కగా తినొచ్చు. రుచికి రుచి. బరువు కూడా తగ్గుతారు.


పెసరపప్పు, మొక్కజొన్నలతో మేలు


​పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల ఒంటికి చలువ. పైగా పప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, సోడియంలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. అదే విధంగా మొక్కజొన్న. మొక్కజొన్నలో కూడా ప్రోటీన్, లిపిడ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, పంచదార శాతం ఎక్కువగా ఉంటాయి. వీటిని చక్కగా ఉడికించి, వేయించి ఎలా అయినా తీసుకోవచ్చు.


దోసకాయ, సోరకాయలు కూడా


దోసకాయ, సోరకాయల్లో కూడా నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయల్లో ఇవి ఒకటి. దోసకాయల్ని మనం సలాడ్స్, నేరుగానైనా తీసుకోవచ్చు. అదే విధంగా, సోరకాయని మీరు పప్పు, కూరలు, ఎలా అయినా వండుకుని తినొచ్చు. వీటి వల్ల పోషకాలు అందుతాయి. కడుపు నిండుతుంది. ఫ్యాట్‌లాస్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది.


క్యాబేజీ, క్యారెట్‌లతో బెనిఫిట్స్


క్యాబేజీ, క్యారెట్స్‌లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. క్యాబేజీలో విటమిన్ కె, సి,ఫైబర్, ఫోలేట్, బి విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మాంగనీస్‌లు ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీర్ణశక్తి, ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాకుండా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీర కణాలను డ్యామేజ్ కాకుండా చేస్తాయి. ఫ్యాట్ పెరగకుండా చేస్తాయి.


ఇక క్యారెట్స్‌లో బీటా కెరోటిన్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని, జీర్ణ ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. వీటిలోని నీటిశాతం కడుపు నిండేలా చేస్తుంది. వీటిని హెల్దీ స్నాక్స్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు.


బొప్పాయి,  శనగలు


బొప్పాయి పండు కూడా ఎంతో టేస్టీగా ఉండే పండు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా నీటిశాతం ఎక్కువగా ఉండి విటమిన్స్, ఫైబర్, పొటాషియం, ఫొలేట్, యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపీన్‌లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, జీర్ణ శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.


శనగలు కూడా మంచి గ్రెయిన్. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటిని మనం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేయడమే కాకుండా, కండరాలకి కూడా మంచిది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa