ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ దిశగా భారీ ఎత్తున అమెరికా బలగాలు.. ట్రంప్

international |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 09:38 PM

ఇరాన్‌లో నెలకున్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పెద్ద సైనిక దళం ఇరాన్ దిశగా వెళ్తోందని ఆయన అన్నారు. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూనే, సైనిక చర్య ఉండకపోవచ్చని ఆయన ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గత వారం, ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన హింసాత్మక అణచివేతపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నిరసనకారుల మరణశిక్షలను ఇరాన్ నిలిపివేసిందని వైట్‌హౌస్ పేర్కొనడంతో టెహ్రాన్‌పై దాడి చేస్తానన్న బెదిరింపులను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు.


అయితే, గురువారం మాత్రం మళ్లీ మాట మార్చిన అమెరికా అధినేత.. సైనిక సన్నాహాలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. గతవారం USS అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాలని ఆదేశించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ నుంచి తిరిగి వస్తూ ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ‘మేము ఇరాన్‌ను గమనిస్తున్నాం’ అని చెప్పారు. ‘మీకు తెలుసు, మేము ముందుజాగ్రత్తగా చాలా నౌకలను ఆ దిశగా పంపుతున్నాం... మేము ఒక పెద్ద సైన్యాన్ని ఇరాన్ వైపు పంపుతున్నాం’ అని తెలిపారు.


ఏమీ జరగకూడదని తాను కోరుకుంటున్నాను, కానీ మేము వారిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ఆ సైనిక దళాన్ని ‘ఒక ఆర్మాడా’, ‘భారీ నౌకాదళం’ అని అభివర్ణించారు. బహుశా దానిని ఉపయోగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. తన బెదిరింపులతోనే ఇరాన్‌ 837 మంది నిరసనకారుల ఉరిశిక్షలను ఆపివేసిందని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు.


నిరసనలకు సంబంధించి తమ మొదటి అధికారిక గణాంకాలను ఇరాన్ బుధవారం వెల్లడించింది. ఇటీవల తగ్గినట్లు కనిపించిన ఈ నిరసనలలో 3,117 మంది మరణించారని అధికారులు తెలిపారు. అయితే, మానవ హక్కుల సంఘాల ప్రకారం.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను బలహీనపరిచే లక్ష్యంతో ఇజ్రాయెల్ గతేడాది జూన్‌లో చేపట్టిన 12 రోజుల యుద్ధానికి వాషింగ్టన్ మద్దతు ఇచ్చి, అందులో పాల్గొన్న తర్వాత, ఇరాన్‌పై సైనిక చర్య అవకాశాన్ని ట్రంప్ పదేపదే ప్రస్తావిస్తూనే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa