ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్‌లో నివసిస్తున్న తమ పౌరుల భద్రతపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు 'యూఎస్ వర్చువల్ ఎంబసీ' ఒక అత్యవసర ప్రకటనను జారీ చేస్తూ, అమెరికన్లు వీలైనంత త్వరగా ఇరాన్ సరిహద్దులను దాటాలని సూచించింది. పశ్చిమ దేశాలతో ఇరాన్ కుదుర్చుకోవాల్సిన అణు ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో, అక్కడ ఎప్పుడైనా పరిస్థితులు అదుపు తప్పవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఒకవేళ విమాన ప్రయాణాలు అందుబాటులో లేకపోతే, వెంటనే భూమార్గం ద్వారా పొరుగు దేశాలైన టర్కీ లేదా అర్మేనియాకు వెళ్లాలని ఎంబసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రయాణాలు ప్రమాదకరంగా మారకముందే క్షేమంగా బయటపడాలని హెచ్చరించింది. సరిహద్దుల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణానికి అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
ఒకవేళ దేశాన్ని వీడటం సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నవారు, తగినంత ఆహారం మరియు మంచి నీటిని నిల్వ చేసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. సురక్షితమైన ప్రాంతాలలో తలదాచుకోవాలని, అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉందని, సమాచారం కోసం స్థానిక వార్తా ఛానెళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలని స్పష్టం చేసింది.
అణు ఒప్పందం విషయంలో ఇరాన్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణించాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, అమెరికా ప్రభుత్వం తన పౌరుల రక్షణను ప్రాధాన్యతగా తీసుకుని ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa