భారతీయ వైద్య శాస్త్ర చరిత్రలో సుశ్రుతుని పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగినది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన ఈయనను ప్రపంచం నేడు 'శస్త్రచికిత్స పితామహుడు'గా గౌరవిస్తోంది. వారణాసి (కాశీ) పుణ్యక్షేత్రంలో సాక్షాత్తూ ఆ ధన్వంతరి వద్దే ఆయన వైద్యవిద్యను అభ్యసించి, అప్పట్లోనే అసాధ్యమైన వైద్య విధానాలను సుసాధ్యం చేశారు. నేటి ఆధునిక వైద్యానికి పునాదులు వేసిన అనేక చికిత్సలు కొన్ని వేల ఏళ్ల క్రితమే సుశ్రుతుని హస్తవాసితో ప్రారంభమవ్వడం మన దేశ గర్వకారణం.
నాటి కాలంలోనే సుశ్రుతుడు క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముక్కు ఆకారాన్ని సరిచేసే ప్లాస్టిక్ సర్జరీ (రైనోప్లాస్టీ), ప్రసవ సమయంలో చేసే సిజేరియన్లు, కంటి శుక్లాల తొలగింపు వంటి పద్ధతులను ఆయన ఆచరించారు. అంతేకాకుండా, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను తొలగించే శస్త్రచికిత్సల్లో కూడా ఆయన ఆరితేరిన వారు. ఈ విజ్ఞానం శతాబ్దాల క్రితమే భారతీయులకు తెలుసని చెప్పడానికి ఆయన చేసిన ప్రయోగాలే సజీవ సాక్ష్యాలు.
శస్త్రచికిత్స అంటే కేవలం కోత కోయడమే కాకుండా, రోగికి కలిగే వేదనను తగ్గించడం కూడా ముఖ్యమని సుశ్రుతుడు భావించారు. అందుకే ఆపరేషన్ సమయంలో రోగికి నొప్పి తెలియకుండా ఉండేందుకు 'ద్రాక్షరసాన్ని' మత్తుమందుగా (Anesthesia) ఉపయోగించేవారు. వైద్య రంగంలో అనస్థీషియా ప్రాముఖ్యతను అప్పట్లోనే గుర్తించిన మేధావి ఆయన. ఈ విధానం వల్ల రోగులకు ఎంతో ఉపశమనం లభించేది మరియు శస్త్రచికిత్సలు మరింత సులభంగా జరిగేవి.
సుశ్రుతుడు అందించిన గొప్ప గ్రంథం 'సుశ్రుత సంహిత'. ఇందులో ఆయన సుమారు 101 రకాల విభిన్న శస్త్రచికిత్స పరికరాల గురించి సవివరంగా వివరించారు. ఈ పరికరాలు నేటి ఆధునిక సర్జరీల్లో వాడే పనిముట్లకు నమూనాలుగా నిలుస్తున్నాయి. మానవ శరీర నిర్మాణంపై పూర్తి అవగాహన కలిగి ఉండటమే కాకుండా, వైద్య రంగంలో క్రమశిక్షణ మరియు పరిశుభ్రతకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఆయన అందించిన జ్ఞానం నేటికీ ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు దిక్సూచిగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa