ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 రోజుల్లోనే 800 మందికిపైగా మిస్సింగ్,,,,ఢిల్లీలో ఏం జరగుతోంది

national |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 09:38 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే 800 మందికిపైగా ఆచూకీ లేకుండాపోయియనట్టు సాక్షాత్తు పోలీసుల రికార్డులే బయటపెట్టారు. జనవరి 1 నుంచి 15 మధ్య మొత్తం 807 మంది అదృశ్యమయ్యారు. ఇది మొత్తం మిస్సింగు కేసుల్లో దాదాపు మూడింట రెండొంతులకు సమానం. జనవరి 1 నుంచి 15వ తేదీ మధ్య కనిపించకుండా పోయిన 807 మందిలో, ఏకంగా 509 మంది మహిళలు, బాలికలే ఉన్నారు. అంటే, రోజుకు సగటున 54 మంది కనిపించకుండాపోయారు. మిస్సింగ్ కేసుల్లో 509 మహిళలు, బాలికలు, 298 మంది పురుషులు ఉన్నారు.


అయితే, అదృశ్యమైనవారిలో 235 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. మిగతా 572 మంది ఏమయ్యారో తెలియరాలేదని పోలీసుల రికార్డులు చూపుతున్నాయి. అలాగే, కనిపించకుండాపోయిన మొత్తం కేసుల్లో 191 మంది మైనర్లు ఉండటంతో బాలల భద్రతపై ఆందోళనను ఇది ఎత్తిచూపుతోంది. వీరిలో ఎక్కువ మంది బాలికలే (145 బాలికలు, 45 మది బాలురు) కావడం మరింత కలవరానికి గురిచేస్తోంది. తప్పిపోయిన మైనర్లలో ఎక్కువ మంది టీనేజర్లు ఉన్నారు. ఈ కాలంలో 169 మంది టీనేజర్లు తప్పిపోయినట్లు గుర్తించారు. వారిలో 138 మంది బాలికలు, 31 మంది బాలురు. ఈ టీనేజర్ కేసులలో దాదాపు 71 శాతం ఇప్పటికీ పరిష్కారం కాలేదని పోలీసు డేటా సూచిస్తుంది.


అలాగే, 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు 13 మంది అదృశ్యమయ్యారు. వీరిలో ఎనిమిది మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు. ఎనిమిదేళ్లలోపు పిల్లలు 9 మంది ఆచూకీ కానరాలేదు. వీరిలో ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. జాడలేని వ్యక్తులలో వయోజనులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 363 మంది మహిళలు, 253 మంది పురుషులతో సహా మొత్తం 616 మంది వయోజనులు అదృశ్యమైనట్లుగా గుర్తించారు. వీరిలో 181 మంది జాడను పోలీసులు గుర్తించగా.. 435 కేసులు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి.


తాజా గణాంకాలు రాజధానిలో నెలకొన్న దీర్ఘకాలిక ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. గతేడాది ఢిల్లీలో 24,500కు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, వీరిలో 60 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. దశాబ్దల గణాంకాల విశ్లేషణ ప్రకారం.. గత 10 ఏళ్లలో నగరంలో దాదాపు 2.3 లక్షల మంది అదృశ్యమయ్యారు, వీరిలో సుమారు 52,000 కేసులు ఇంకా పరిష్కారం కాకుండానే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa